ఆ రెండింటితో చచ్చేచావు!

23 Oct, 2019 03:44 IST|Sakshi

సగం వ్యయం ఆ రెండు రోగాలకే

గుండెజబ్బులు, క్యాన్సర్‌లదే సింహ భాగం

44,472 మంది గుండెజబ్బు 

బాధితుల కోసం రూ.365.41 కోట్లు..

30,665 మంది క్యాన్సర్‌ రోగుల కోసం రూ.197.40 కోట్లు ఖర్చు

ఇవి కేవలం ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసిన వివరాలు మాత్రమే

అలాగే, జీవనశైలి జబ్బులతో 1.35 కోట్ల మంది అవస్థలు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలనలో విస్మయపరిచే నిజాలు

రాష్ట్రంలో రక్తపోటు, మధుమేహం జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్‌ పరీక్షల్లో తేలింది. ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు, వ్యాయామం లేకపోవడమే ఇందుకు ప్రాథమిక కారణం. మద్యం, పొగాకు మితిమీరిన వినియోగంవల్ల క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి వారి కోసం రాష్ట్రంలో డీ–అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని చెప్పాం. రొటీన్‌ జీవితంలో మార్పులు వచ్చేలా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. లేదంటే ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్, గుండెపోటు వంటి వాటిపై గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన ఉండదు. ఫలితంగా ప్రజలకూ, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంటుంది.    
– సుజాతారావు, రిటైర్డ్‌ ఐఏఎస్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ చైర్‌పర్సన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు రకాల జబ్బులు అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందరూ ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్న ఈ పరిస్థితి చూసి వైద్య నిపుణులతోపాటు సర్కారూ ఆందోళన వ్యక్తంచేస్తోంది. బాధిత కుటుంబాల పరిస్థితి అయితే ఊహించలేనిది. ముఖ్యంగా కుటుంబ పెద్ద ఈ రోగాల బారిన పడితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో తాజాగా వెలుగుచూసిన ఈ వాస్తవాలు అందరినీ విస్మయానికి.. ప్రధానంగా ప్రభుత్వాన్నీ తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.వెయ్యి కోట్లు ఖర్చయితే.. ఇందులో రెండు జబ్బులకే రూ. 500 కోట్లు అయింది. 

సగం వ్యయం ఆ రెండు రోగాలకే   గుండెజబ్బులు, క్యాన్సర్‌లదే సింహ వాటా
కోటీ 32 లక్షల మంది ఎన్‌సీడీ కోరల్లో
రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (ఎన్‌సీడీ–నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌) బారిన పడిన వారిలో 1.35 కోట్ల మంది ఉన్నట్లు తేలింది. వీరిలో అనేకమంది క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు.. ఇలా జీవనశైలి జబ్బుల్లో ఏదో ఒక జబ్బుకు దగ్గరై ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్‌సీడీ క్లినిక్‌ల పేరిట చికిత్సలు చేస్తుండగా.. అందులో నమోదైన వారు కేవలం 53 వేల మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 13, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 85 క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్‌లలో అన్ని రకాల జీవన శైలి జబ్బులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. బాధితుల జనాభాను బట్టి చూస్తే మరో 200 ఎన్‌సీడీ క్లినిక్‌లు పెంచాల్సిన అవసరం ఉందని, దీనికి రూ.32 కోట్లు వ్యయమవుతుందని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది.

గుండెజబ్బులు.. క్యాన్సర్‌లకే తడిసిమోపెడు
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి జబ్బులు (లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా గుండెపోటు జబ్బులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీలో గత ఏడాది జరిగిన చికిత్సల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. కార్డియో వాస్క్యులర్‌ జబ్బులకు ఒక్క ఏడాదిలో రూ.365.14 కోట్ల వ్యయమైంది. ఇక క్యాన్సర్‌ రోగులకూ గతేడాదిలో రూ.197.40 కోట్లు వ్యయం చేశారు. అలాగే, కిడ్నీ బాధితుల చికిత్స, డయాలసిస్‌లకు కలిపి రూ.69.31 కోట్లు ఖర్చయింది. ఇలా మొత్తం 1048 జబ్బులకు గాను రూ.1000 కోట్లు నిధులు ఇస్తే ఇందులో రూ.532.12 కోట్లు ఈ మూడు జబ్బులకే వ్యయమైందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వెయ్యొచ్చు.

క్యాన్సర్‌కు కారణాలు చాలా..
పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాలు, మేనరికాలు, మద్యం సేవించడం, పొగతాగడం వంటివి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. మన రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన ప్రతి 28 మందిలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడుతున్నట్టు అంచనా. వీలైనంత వరకూ నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడం. తాజా పళ్లు, కూరగాయాలు తినడం మంచిది.
– డా. సీహెచ్‌ సులోచనాదేవి, క్యాన్సర్‌ వైద్య నిపుణులు, విజయవాడ

జీవనశైలి జబ్బులు పెరిగాయి 
గ్రామాల్లోనూ బీపీ, మధుమేహం మందుల వినియోగం బాగా పెరిగింది. గుండెజబ్బులు విపరీతంగా పెరిగాయి. వీటి చికిత్స ఖరీదైపోవడంతో అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించడం లేదా రాకుండా చూడటం చేయాలి. నాలుగు క్యాన్సర్‌ ఆస్పత్రులను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాం. 
– డా. బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో వైద్యులు, నిపుణుల కమిటీ సభ్యులు

అవగాహన కల్పించాలి
మనం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎక్కువగా గుండెజబ్బులు, క్యాన్సర్‌కు ఖర్చుచేస్తున్న విషయం వాస్తవమే. అర్బన్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే చిన్నతనం నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం నేర్పాలి. 
    – డా. ఎ. మల్లిఖార్జున, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో

మరిన్ని వార్తలు