కేన్సర్ పంజా!

2 May, 2016 00:38 IST|Sakshi


 గంగువారి సిగడాం గ్రామంపై కేన్సర్ మహమ్మారి పంజా విసిరింది. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉన్న ఈ ఊర్లో రెండు నెలల వ్యవధిలో పదిమంది ఈ వ్యాధి లక్షణాలతో మృత్యువాతపడగా... 50 మందికి పైగా మంచం పట్టారు. దీంతో గ్రామస్తులంతా వణికిపోతున్నారు. కేన్సర్ వ్యాధికి ప్రధాన కారణం తెలియనప్పటికీ.. బావి నీటిని తాగడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు భావిస్తున్నారు.
 
 జి.సిగడాం: మండల కేంద్రమైన జి.సిగడాం గ్రామస్తులు తీవ్రమైన భయూందోళనలో ఉన్నారు. రెండు నెలల క్రితం వరకూ కళ్లముందు తిరిగిన వారు ఇప్పుడు మంచం పట్టడంతో ఏం జరుగుతోందో తెలియక కలవర పడుతున్నారు. అనారోగ్యానికి గురైన వారంతా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరడం.. వారిని పరీక్షించిన వైద్యులు కేన్సర్ వ్యాధి సోకినట్టు ప్రకటిస్తుండడంతో వణికిపోతున్నారు. వ్యాధి లక్షణాలతో రెండు నెలల వ్యవధిలో సువ్వాడ తవిటినాయుడు, తాండ్రోతు నాగమ్మ, తాండ్రోతు రాజుబాబు, కీర్తి చిన్నయ్య, యడ్ల చిన్న రాములమ్మ, స్వువాడ సత్యవతి లతోపాటు మరో నలుగురు మృతి చెందారు.
 
 మరో 50 మందిపైగా ఈ వ్యాధితో మంచం పట్టారు. వ్యాధి బారిన పడిన వారిలో వల్లిరెడ్డి సీతంనాయుడు, బి.శ్రీనివాసరావు, మున్నగొట్టి రాములు, తాండ్రోతు చంద్రమ్మ, నక్కన మల్లమ్మ , ఈగల రాముల్మ, బోట్టు నీలయ్య, యడ్ల పెద్ద రాములమ్మ, కడగల కృష్ణ, పతివాడ చంద్రరావు, నగరి పద్మవతి, లతోపాటుమరో 40 మంది ఉన్నారు.
 వీరంతా విశాఖపట్నం మహాత్మ గాంధీ కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోగం బారిన పడిన వారిలో కొంతమంది నిరుపేదలు కావడం, డబ్బుల్లేక సరైన వైద్యం పొందలేక పోతున్నారు.
 
 రెండేళ్లుగానే కేన్సర్ కేసులు
 2014 నుంచి గ్రామంలో కేన్సర్ రోగులు పెరుగుతున్నారు. సుమారు 50 మంది రోగ లక్షణాలతో బాధపడుతున్నారు. బావి నీటిపైనే అనుమానాలు ఉన్నాయి. కేన్సర్ వ్యాధి ఎందుకు ప్రబలిందో అర్ధం కావడం లేదు.
 వెలది సాయిరాం, సర్పంచ్, జి.సిగడాం
 
 వైద్యానికి రూ. మూడు లక్షలు ఖర్చు చేశా
     నా భార్య రాములమ్మకు కేన్సరని విశాఖలోని మహత్మాగాంధీ ఆస్పత్రి  వైద్యులు నిర్థారించారు. చికిత్స కోసం ఇప్పటి వరకూ సుమారు రూ. మూడు లక్షలు ఖర్చు చేశాను. తరచూ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తోంది. మాలాంటి పేదలను ప్రభుత్వమే అదుకోవాలి.
 - ఎన్.గన్నయ్య, జి.సిగడాం
 
  ప్రభుత్వం అదుకోవాలి         
 గ్రామంలో కేన్సర్‌తో బాధపడుతున్న రోగులను, మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వమే అదుకోవాలి. బావి నీటిని వాడడం వల్లే ఈ వ్యాధి వాపిస్తోందని భావిస్తున్నాం. అధికారులు స్పందించి నీటి పరీక్షలు నిర్వహించాలి.
 - కీర్తి రమణ జి.సిగడాం
 
  ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నాం
 జి.సిగడాం గ్రామంలో కేన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుతోంది. దీంతో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. గ్రామంలో ప్రత్యేక సర్వే చేపట్టాలని సూచించాం. వ్యాధి వ్యాపించడానికి కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖ పంపిస్తున్నాం.
 - ఎం.కోటేశ్వరరావు,
  వైద్యాధికారి, జి.సిగడాం

మరిన్ని వార్తలు