అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

1 Aug, 2019 04:08 IST|Sakshi

రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ నగరంతోపాటు దాని పరిసర జిల్లాల్లో ఇటీవల కాలంలో క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఐసీఎంఆర్‌ డేటా ప్రకారం 2016లో ఆంధ్రప్రదేశ్‌లో 58 వేలు, తెలంగాణలో 42 వేల క్యాన్సర్‌ కేసులు ఉన్నట్లు తేలిందని వివరించారు.  

స్పిన్నింగ్‌ మిల్లులను గట్టెక్కించాలి
ఆంధ్రప్రదేశ్‌లో స్పిన్నింగ్‌ మిల్లులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయాన్ని ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభ జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్పిన్నింగ్‌ మిల్లులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఉత్పత్తి హాలిడే ప్రకటించా ల్సిన దుస్థితికి చేరుకున్నాయని ఆయన అన్నారు.   ఈ నేపథ్యంలో స్పిన్నింగ్‌ మిల్లులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

రోడ్డు ప్రమాదాలపై దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలి
రోడ్డు ప్రమాదాలపై లోతైన దర్యాప్తునకు వీలుగా కేంద్ర వాహన ప్రమాద దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని  ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. మోటారు వాహనాల బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మోటారు వాహనాల బిల్లు తెచ్చినం దుకు కేంద్ర రవాణాశాఖ మంత్రికి అభినందనలు.. రోడ్డు రవాణా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. అయితే ఈ బిల్లులో మూడింటిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నిబంధన 36 పరిధిలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు టాక్సీ అగ్రిగేటర్లకు లైసెన్స్‌లు జారీచేయాలి. అయితే ఈ మార్గదర్శకాలపై బిల్లులో స్పష్టత లేదు. రహదారులపై ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో జరిపే పర్యవేక్షణ కోసం అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందా? రాష్ట్రాలు భరించాలా అన్న అంశంపై స్పష్టత లేదు.  మరోవైపు ఈ బిల్లులో క్లాజ్‌ 65 ద్వారా వేస్తున్న రూ. 100 కోట్ల జరిమానా చాలా పెద్ద మొత్తం. అందువల్ల దీనిని పునఃసమీక్షిం చాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు.

అవయవ వాణిజ్యంపై ఉక్కుపాదం మోపండి: వేమిరెడ్డి
దేశంలో మానవ అవయవ వాణిజ్యం పెరిగిపోయిందని, దీనిపై ఉక్కుపాదం మోపని పక్షంలో వీధి బాలుర అదృశ్యాలు, అపహరణలు పెరిగిపోతాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మూత్ర పిండాలు, కాలేయాలకు డిమాండ్‌ ఉన్న నేప థ్యంలో ఈ అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అవయవ వర్తక రాకెట్లు తయారవుతున్నాయని వివరించారు. అందువల్ల దోషులకు మరణ శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు