విధివంచిత సుజాత

30 Jan, 2019 13:20 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుజాత , సుజాత(ఫైల్‌)

క్యాన్సర్‌తో నరకయాతన

సాయం కోసం ఎదురుచూపులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వాళ్లిద్దరివి వేర్వేరు మతాలు. పెద్దలను ఎదిరించారు. పెళ్లి చేసుకున్నారు. అయితే విధి వారి మీద పగబట్టింది. సుజాతకేన్సర్‌ బారిన పడింది. సాయం కోసం కనబడిన ప్రతి ఒక్కరినీ అర్థిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్‌లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్, సుజాత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలు వారిని దగ్గరకు రానివ్వలేదు. టింకరింగ్‌ పనిచేస్తూ ఇస్మాయిల్‌ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇలా పదేళ్లు గడిచిపోయాయి. గతేడాది నుంచి సుజాతకు తరచూ కడుపునొప్పి రావడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమైంది. వైద్యులు పరీక్షలు చేసి గర్భకోశ సంబంధిత కేన్సర్‌గా నిర్ధారించారు. ఇస్మాయిల్‌ రోజువారీ టింకరింగ్‌ పని ఆగిపోయింది.

ఆమెకు సేవలు చేయడంతోనే సరిపోతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయారు. ఆస్పత్రిలో మందులకు, పరీక్షలకు అప్పులు చేయాల్సివచ్చింది. కనీసం తిండికి కూడా లేని పరిస్థితులతో కేన్సర్‌ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకుంది. సుజాత మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం దర్గామిట్ట సుజాతమ్మ కేన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ పరిస్థితిని చెప్పేందుకు సుజాత గొంతు పెగలడం లేదు. ఇస్మాయిల్‌ నిస్సహాయ స్థితిలో సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆర్థికంగా చేయూతనందించదలచిన వారు పి.సుజాత, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌: 3462200115726, సిండికేట్‌ బ్యాంక్, దర్గామిట్ట, నెల్లూరు, ఐఎఫ్‌సీ కోడ్‌: ఎస్‌వైఎన్‌బీ 0003462 బ్రాంచిలో జమ చేయాలని అర్థిస్తున్నారు. వివరాలకు ఫోన్‌నంబర్‌: 81063 77737లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు