క్యాన్సర్‌ చికిత్సకు సాయం చేసిన సీఎం

13 Jul, 2019 09:33 IST|Sakshi

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే పేదరికం. ఆపై కేన్సర్‌తో సతమతం... ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక పెట్టుబడి పెట్టలేక మరణమే శరణ్యమనుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆదుకున్నారు. సీఎం సహాయ నిధినుంచి పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వారికి కొండంత బలం చేకూరింది. మళ్లీ బతికి మామూలుగా తిరుగాడుతామన్న నమ్మకం కలిగింది. ఇదీ చీపురుపల్లి పట్టణంలో ఓ కుటుంబం దీన గాథ. చీపురుపల్లి పట్టణం కొద్దగవిడి వీధికి చెందిన రవికుమార్‌ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు.

ఆయన తండ్రి సీతారామమూర్తి ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగ విరమణ చేయగా ఆయనకు పింఛన్‌ సౌకర్యం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది నెలల క్రితం రవికుమార్‌ భార్య ఉషారాణికి బ్లడ్‌ కేన్సర్‌ మహమ్మారి సోకింది. ఆస్పత్రుల్లో చూపిస్తే బోన్‌మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలనీ, అందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు.

ఆ స్థాయిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అప్పులు చేసి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం రూ.2 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఆ నిధులు వచ్చేలోగానే ఎన్నికలు రావడం, గడువు ముగిసిపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. 

వైఎస్సార్‌సీపీ నేతల అండతో...
రవికుమార్, ఆయన తండ్రి సీతారామ్మూర్తి జూన్‌ నెలాఖరున మండల వైఎస్సార్‌సీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలను ఆశ్రయించారు. వారు జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన ఎలాంటి జాప్యం చేయకుండా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సమస్య వివరించారు. అంతే జూలై 1న అమరావతి చేరుకుని అక్కడ మంత్రి బొత్సను కలిసి, ఆయన లేఖతో బాటు బాధితురాలు ఉషారాణికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో పూర్తి నివేదిక అందించారు. జూలై 2న తేదీ సాయంత్రం సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి సమర్పించారు. జూలై 4న బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఎంతో రుణపడి ఉంటాం..
నా భార్యకు కేన్సర్‌సోకి చికిత్స చేయించేందుకు నానా అవస్థలు పడుతున్నాం. మా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, మంత్రి బొత్ససత్యనారాయణ చొరవ చూపడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఇంత త్వరగా మా సమస్యపై ముఖ్యమంత్రి స్పందించడం చాలా గొప్ప విషయం. జగన్‌మోహన్‌రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువైంది. 48 గంటల్లో సహాయం అందించడం గతంలో ఎప్పుడూ వినలేదు. మాకు చాలా పెద్ద సహాయం ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.9 లక్షలు అవసరమని కోరగా అందులో యాభై శాతం కంటే ఎక్కువగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు జీవితంలో మరిచిపోలేము.
– రవికుమార్, ఉషారాణి దంపతులు   

మరిన్ని వార్తలు