నిజంగా ‘పరీక్షే’

21 Mar, 2019 11:00 IST|Sakshi
విజయవాడ పటమటలంకలో పరీక్ష కేంద్రంవల్లూరు సరోజనిదేవి ఉన్నత పాఠశాల మీదుగా టీడీపీ ర్యాలీ

సాక్షి, అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందన్న చందంగా ఎన్నికల సందడి విద్యార్థుల భవిష్యత్తుకు గండంగా మారింది. రాజకీయ నాయకులు నామినేషన్ల సమయంలో చేసే హడావుడితో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రాజకీయ నాయకులు తన అనుచరగణంతో పదుల కొద్ది వాహనాలు చేసే ర్యాలీల్లో హారన్‌ శబ్దాలతో చెవులు వాచిపోతున్నాయి.

ఉదయం 9.30 గంటల నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకుల పాదయాత్రలు, ర్యాలీలు మొదలవుతున్నాయి. ఆ సమయంలో రాజకీయ నాయకులు డప్పు వాయిద్యాలు, ఈలలు, కేకలతో మోతమోగిస్తున్నారు. ఈ ర్యాలీలు పదోతరగతి పరీక్షా కేంద్రాల నుంచి పోతున్నప్పుడు అందులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతల మధ్య రాతలెలా రా దేవుడా...? అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఒకేసారి రెండు పరీక్షలు...
మార్చి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో పక్క అదే రోజు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. ఇలా ఒకేసారి విద్యార్థులకు, రాజకీయ నాయకులకు పరీక్షలు మొదలయ్యాయి. మంచి ముహూర్తాలు లేకపోవటమో లేక మరేదైనా కారణమో తెలియదు కాని మొదటి రెండు రోజులు పెద్దగా నామినేషన్ల హడావుడి కనిపించలేదు. బుధవారం నుంచి జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా బుధవారానికి 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. 

గద్దె నామినేషన్‌తో ఇక్కట్లు..
విజయవాడ తూర్పు నియోజవకర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్‌రావు బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. ఇందులో భాగంగా పటమట లంకలోని కృష్ణవేణి రోడ్డులో తన అనుచరులు చేసిన ర్యాలీతో ఆ రోడ్డులో ఉన్న మూడు పదోతరగతి పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులు తీవ్ర ఆటంకం కలిగింది. వల్లూరి సరోజని ఉన్నత పాఠశాల, సీతారామమ్మ బాలికల పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్‌లు ఉన్నాయి.

బుధవారం ఉదయం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి డప్పలు, వాయిద్యాలు, బ్యాండ్‌సెట్‌లతో పదుల సంఖ్యలో వాహనాలలో ర్యాలీ ప్రారంభించారు. వీరు చేసిన హడావుడితో పరీక్షా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకనొక సమయంలో కేంద్రాల బయట ఉన్న తల్లిదండ్రులు తెలుగుదేశం నాయకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలా ప్రవర్తించటం ఏంటంటూ నిలదీశారు. 

స్వీయ నియంత్రణ అవసరం...
పదోతరగతి పరీక్షలు కోసం విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదువుతారు. ఈ పరీక్షలు వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో అడుకుంటూ ర్యాలీలతో ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రాజకీయ నాయకలు గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం కన్నా నాయకులే స్వీయ నియంత్రణ పాటించటం ఉత్తమమని చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల ఇరువైపులా వంద మీటర్ల మేర ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ముందుకుసాగి విద్యార్థులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. 

మరిన్ని వార్తలు