అభ్యర్థుల టెన్షన్

22 Jan, 2016 01:24 IST|Sakshi

 పొందూరు: జిల్లాలోని పశు సంవర్థక శాఖ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత ఏడాది నవంబర్ 29న మల్టీపర్పస్ డెయిరీ ఎక్సటెన్షన్ అసిస్టెంట్ (ఎంపీడీ ఈఏ) పోస్టులకు ఇంటర్వూలు నిర్వహించారు. 52 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ శాఖ నిర్వాకంపై అభ్యర్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో పశువుల ఆస్పత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అనేక పశువైద్య కేంద్రాల్లో అటెండర్లే వైద్యం చేస్తున్న దీనమైన పరిస్థితి ఉంది. సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై 28 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 156 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థి అకడమిక్ రికార్డుకు 80, మౌఖిక పరీక్షకు 20 మార్కులు కేటాయించారు. ఫలితాలు మాత్రం విడుదల కాలేదు.
 
 దళారులను
 ఆశ్రయించిన అభ్యర్థులు
 మౌఖిక పరీక్ష కోసం కొందరు అభ్యర్థులు అధికార పార్టీ నాయకులను, దళారులను ఆశ్రయించారు. పలువురు దళారులు అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నాయకుల ఒత్తిడి కూడా అధికారులపై  విపరీతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అధికారులు కూడా తమ సొంత ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో నాయకుల ప్రభావానికి లోనుకాకుండా అధికారులు  స్వతంత్రంగా ఫలితాలను విడుదల చేశారు. ఇక్కడి అధికారులు మాత్రం నాయకులకే గులామైనట్టు తెలుస్తోంది. అభ్యర్థులు జిల్లా పశు సంవర్థక శాఖాధికారులకు ఫోన్ చేస్తుంటే త్వరలోనే ఫలితాలు వస్తాయని చెప్పడమే తప్ప న్యాయం చేయడం లేదు.
 
 ఫలితాలు విడుదల చేస్తాం...  
 పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్ల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం జరగడం వాస్తవమే. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి నియామకాల జాబితాను విడుదల చేస్తాం.
 - నాగన్న, జేడీ, జిల్లా పశుసంవర్థక శాఖ
 
 పోస్టులను గుర్తించకుండానే...
 జిల్లాలో 28 పోస్టులు భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ, పాల ఉత్తత్తి ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. వాస్తవానికి పోస్టులను గుర్తించిన త ర్వాతనే నోటిఫికేషన్ జారీ చేయాలి. అందుకు విభిన్నంగా జిల్లాలో జరగడం విడ్డూరంగా ఉంది. నియామకాల జాప్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు