గెలిచినా.. ఓడినా..పోటీ ఒక్కసారే!

25 Mar, 2019 09:13 IST|Sakshi

సాక్షి, అమరావతి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల తరఫున ఒక సారి పోటీ చేసిన అభ్యర్థులు ఆ తరువాత అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవడంలేదు. ఓడిన అభ్యర్థులే కాదు.. గెలిచిన అభ్యర్థులదీ అదే పరిస్థితి. 1994 సంవత్సరంలో చల్లా వెంకటకృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సిహెచ్‌.జయరాంబాబుపై గెలిచారు. 1999 ఎన్నికల్లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు.

ఆ సంవత్సరం టీడీపీ అభ్యర్థి శనక్కాయల అరుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఈశ్వరవెంకటభారతిపై గెలిచారు. అప్పటి ప్రభుత్వంలో శనక్కాయల అరుణ మంత్రిగా పనిచేశారు. మరుసటి ఎన్నికకు ఈ ఇద్దరూ దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన తాడిశెట్టి వెంకట్రావు టీడీపీ అభ్యర్థి టి.వెంకటేశ్వరరావుపై గెలిచారు. 2009లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్‌పై గెలిచారు.

ఆ తరువాత 2014లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసినా మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై గెలిచారు. ప్రస్తుతం మోదుగుల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గుంటూరు పశ్చిమం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఏసురత్నం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మద్దాళి గిరి పోటీచేస్తున్నారు.   

మరిన్ని వార్తలు