చంద్రబాబూ.. కళ్లు తెరవండి

3 Apr, 2015 01:56 IST|Sakshi
ఐజీ కార్ల్ నమూనాను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు
  • ఐజీ కార్ల్‌కు నిధులున్నా పట్టించుకోని ప్రభుత్వం
  • మీడియాతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • సాక్షి, కడప: అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రంలో అద్భుతమైన భవనాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ కేవలం దివంగత వైఎస్సార్  స్వప్నాన్ని నాశనం చేయాలన్న సంకల్పంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

    వైఎస్సార్ జిల్లా పులివెందులలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఐజీ కార్ల్)ను గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, ఐజీ కార్ల్ డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో వైఎస్సార్ అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన హంగులతో పశుపరిశోధన కేంద్రాన్ని నెలకొల్పారని చెప్పారు.

    అందులో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీతో అత్యుత్తమమైన బ్రీడ్స్‌ను తయారు చేసి ప్రజలకు అందించాలని సంకల్పించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసి.. ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు పశుసంపద పరంగా కూడా ఆదాయాన్ని అందించి ధైర్యంగా బతికే అవకాశం కల్పించేలా వైఎస్సార్ దీనికి రూపకల్పన చేశారని చెప్పారు.

    కొత్త జాతుల సంరక్షణతోపాటు పురాతన జాతుల అభివృద్ధి, ఇతర అనేక జంతు జాలానికి సంబంధించి పరిరక్షణకు ఐజీ కార్ల్ నిర్మించారని, అందులో భాగంగా రూ.247 కోట్లు ఏపీఐఐసీకి విడుదల చేసి పనులకు ఖర్చు పెట్టారని తెలిపారు. మరో రూ.123 కోట్లు తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాలల పీడీ అకౌంట్‌లో ఉన్నాయన్నారు. నిధుల కొరత లేనప్పటికీ టీడీపీ ప్రభుత్వం నాటకమాడుతూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

    దీనిపై జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులను కలిపి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు పంపినా స్పందించలేదని దుయ్యబట్టారు.  ఇక్కడ అధునాతన వసతులు, టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని   ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ రాసినా చంద్రబాబు సర్కార్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
     
    మూడు నెలలవుతున్నా ఏదీ అనుమతి?

    ఐజీ కార్ల్‌కు సంబంధించి పరిశోధనలు చేసేందుకు జినోమిక్స్, బయోటెక్స్, గ్లోబెల్, బిజినెల్, ఇంక్యుబేటర్ కంపెనీలు ఆసక్తి చూపినా.. చంద్రబాబు మూడు నెలలుగా తాత్సారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. మూడు నెలల కిందటే ఈ కంపెనీలకు చెందిన పత్రాలు అనుమతి కోసం బాబు టేబుల్ వద్ద ఉన్నా.. పట్టించుకోలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు