మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

16 Feb, 2015 02:33 IST|Sakshi
  • పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పొంగులేటి
  • ఏ పార్టీకీ తీసిపోని విధంగా వైఎస్సార్‌సీపీని నిలుపుతాం
  • వైఎస్సార్ సంక్షేమం ప్రజలకు అందేలా కృషిచేస్తాం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీలకు ఎక్కడా తీసిపోని విధంగా పార్టీని కష్టపడి నిలబెట్టుకుంటామని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసేందుకు అందరం కలసికట్టుగా కృషిచేద్దామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసి, ప్రజలపక్షాన నిలబడితే 2019లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం పెద్ద కష్టం కాదన్నారు.

    ఆదివారం వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సహా రాబోయే అన్ని ఎన్నికల్లోనూ పోటీచేసి బలాన్ని నిరూపించుకుని మిగతా పార్టీలకు వణుకు పుట్టిస్తామన్నారు. అధికారమనేది ఎవరి సొత్తు కాదని, కష్టపడితే ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ లేదని, పార్టీ పని అయిపోయిందంటూ కొన్ని దుష్టశక్తులు దుష్ర్పచారం చేశాయన్నారు.

    దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను అమలు చేసేందుకు, ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూసేందుకు కృషిచేస్తామని పొంగులేటి చెప్పారు. సమస్యలు చెప్పుకోవడానికి, ఆయా అంశాలపై చర్చించుకునేందుకు తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. పార్టీ కోసం పాటుపడేవారికి, పనిచేసిన వారికి తప్పకుండా సముచిత పదవులిచ్చి గౌరవించుకుంటామన్నారు.

    రాబోయే రోజుల్లో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా పార్టీ అధ్యక్షుడు జగనన్నను ఆదర్శంగా తీసుకుని ఆశయాలు, లక్ష్యసాధన కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఉండగా అన్ని ప్రాంతాలను సమానదృష్టితో చూసి, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందేలా కృషిచేశారన్నారు. ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రసంగిస్తూ తెలంగాణలో అనేక సమస్యలున్నాయని, విభజన తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలపై పోరాడుతూ రాష్ట్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు.

    ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలుకావడం లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ 8 నెలల పాలనలో దళితుల అభ్యున్నతి కానరాకుండా పోయిందన్నారు. మరో ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ. రెహ్మాన్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఎలక్షన్, కలెక్షన్, కన్‌స్ట్రక్షన్ అన్న చందంగా సాగుతోందని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాలను చంద్రబాబు, కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

    రైతు విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ పార్టీలో అన్నిస్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని రాష్ట్రస్థాయి వరకు పటిష్టంచేయాలని కోరారు. అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ జెండా, ఎజెండా ఉన్న పార్టీ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేష్, సత్యంశ్రీరంగం, ఆకులమూర్తి, సిద్ధార్థరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, ఎ.విలియం, భీమయ్యగౌడ్, ముస్తాఫా, జయరాజ్, హర్భట్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎడ్మ కిష్టారెడ్డి, బీష్వ రవీందర్, అహ్మద్, నర్రా భిక్షపతి, ఎం.శంకర్, డాక్టర్ ప్రఫుల్ల, వి.ఎల్.ఎన్. రెడ్డి, వెల్లాల రామ్మోహన్, ఎస్.రమేశ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు