రాజధాని ‘భూ’మ్

25 May, 2014 02:05 IST|Sakshi
రాజధాని ‘భూ’మ్

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొండెక్కిన భూముల ధరలు
 
 సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్టర్ల దృష్టంతా ప్రస్తుతం ఈ రెండు జిల్లాల పైనే ఉంది. నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడి భూములకు భారీగా డిమాండ్ వచ్చింది. రాజధానిగా ఏర్పడితే భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే భావనతో ఈ ప్రాంతంలో చాలామంది భూములు, స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇక్కడ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
 
 ఇక్కడ తప్ప అంతటా తగ్గుదలే..
 
 ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, నెల్లూరు తదితర అన్ని రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఆ మేరకు ఆదాయం కూడా తగ్గింది. అయితే కృష్ణా, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం రిజిస్ట్రేషన్ జిల్లాల్లో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాల్లో ఈ ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్లు, రాబడి అనూహ్యంగా పెరగడం విశేషం.
 
 విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్‌లో 2,515 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 7.43 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అదే నెలలో 3,831 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14.28 కోట్ల ఆదాయం వచ్చింది.
 
 విజయవాడ తూర్పు జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 3,493 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8.78 కోట్ల రాబడి రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 4,608 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 15.93 కోట్ల ఆదాయం వచ్చింది.
 
 గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏప్రిల్‌లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున చాలామంది డబ్బు తీసుకెళ్లే మార్గం లేక అడ్వాన్సులు ఇచ్చి మే, జూన్ నెలల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అందువల్ల ఈ నెలలోనూ, వచ్చే నెలలోనూ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
 
 అమ్మో! ఇవెక్కడి ధరలు
 
 గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక వైపు పొలాల్లో వేసిన వెంచర్‌లో రెండు నెలల కిందట చదరపు గజం స్థలం రూ. 1200 ఉండగా ఇప్పుడు రూ. 7000కు పెరిగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రెండు నెలల కిందట రూ. 20 లక్షలున్న ఎకరా భూమి ఇప్పుడు రూ. 2 కోట్లు పలుకుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో రెండు నెలల కిందట ఎకరం పొలం రూ. 15 లక్షలు ఉండగా ఇప్పుడు రూ. కోటిన్నరకు పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో యజమానులు భూముల్ని అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు.

 


 

మరిన్ని వార్తలు