‘టీడీపీ ప్రభుత్వమే పంటలను తగులబెట్టించింది’

5 Dec, 2019 14:53 IST|Sakshi

సాక్షి, తుళ్లూరు : గత టీడీపీ ప్రభుత్వమే రాజధానిలో పంటలను తగులబెట్టించిందని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. గురువారం తుళ్లూరులో రాజధాని రైతులు, కూలీలు ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు బంధువులకు కూడా రాజధానిలో భూములున్నాయని విమర్శించారు. రాజధాని భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. తమ భూములన బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. రైతులను చంద్రబాబు భయంకరంగా మోసం చేశారని మండిపడ్డారు. 

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో టీడీపీ నేతలు అవినీతిని పాల్పడ్డారని విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ అంటూ రైతులకు నోటీసులు ఇచ్చారని.. భూమి ఇవ్వకపోతే రూ. 5లక్షలే ఇస్తామని చంద్రబాబు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారడీ నుంచి ప్రజలు బయటకొచ్చారని తెలిపారు. సీఆర్‌డీఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రూ. 58వేల కోట్లు దోచేశారని శేషగిరిరావు ఆరోపించారు. 

చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారు : జోగి రమేశ్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కానీ  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా అమరావతి పేరుతో చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. బాహుబలి గ్రాఫిక్స్‌, విఠలాచార్య సినిమా జిమ్మిక్కులు చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ నివాసం అమరావతిలోనే ఉందని.. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు సిగ్గుగా లేదని నిలదీశారు. 

చంద్రబాబు అంటరానితనాన్ని ప్రోత్సహించారు : భాగ్యరావు
దళిత హక్కుల పోరాట నేత మన్నెం భాగ్యరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అంటరానితనాన్ని, వివక్షతను ప్రోత్సహించారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు న్యాయం చేయాలని ఆనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చిన పట్టించుకోలేదని తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగ ఉల్లంఘన చేసింది చంద్రబాబు ఒక్కరేనని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంట నడిచారని చెప్పారు. 

భారీగా తరలివచ్చిన రైతులు..
ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని రాజధాని రైతులు రౌండ్‌టేబుల్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని పేరిట చంద్రబాబు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతోనే.. ఆయన పర్యటనలో నిరసన చేపట్టామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు