‘రాజధాని’ భూముల వేలం!

18 Jan, 2015 00:18 IST|Sakshi
‘రాజధాని’ భూముల వేలం!
  • రైతుల నుంచి తీసుకునే 35 వేల ఎకరాల్లో 5 వేల ఎకరాలు అమ్ముకోవాలని సర్కారు నిర్ణయం
  • ఎకరం రూ.15 కోట్ల లెక్కన రూ.75 వేల కోట్ల ఆదాయం
  • వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, బోరుపాలేల్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు
  • సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం సమీకరించే, సేకరించే భూములతో స్వయంగా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగనుంది. రాజధాని కోసం సేకరించే భూముల్లో ఏకంగా ఐదువేల ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ఎకరం పదికోట్ల నుంచి రూ.15 కోట్ల విలువ ఉండనుంది. అంటే ఎకరం రూ.15 కోట్ల వంతున ఐదువేల ఎకరాలను అమ్మి ప్రభుత్వం రూ.75 వేల కోట్లను ఆర్జించనుంది.

    35 వేల ఎకరాలను రాజధాని ప్రాంతం కోసం సేకరిస్తున్నప్పటికీ వాస్తవంగా రాజధాని కోసం, పరిపాలనా కేంద్రాలైన ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం రెండువేల ఎకరాల పరిధి సరిపోతుందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం పరిపాలనా రాజధాని కృష్ణానదికి ఆనుకుని గుంటూరు జిల్లా వైపు వెంకటాయపాలెం, ఉద్దండ రాయంపాలెం, బోరుపాలేల్లో ఉంటుంది. పరిపాలన రాజధాని ఎనిమిది కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటర్ వెడల్పు భూ భాగం పరిధిలో ఉంటుంది.

    ఇందులో నాలుగు కిలోమీటర్ల పొడవులో అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయం నిర్మిస్తారు. మిగతా నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిమ్మింగ్ పూల్, టెన్నిస్, గోల్ఫ్ కోర్టులు, పిక్నిక్ ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు. ఈ ఎనిమిది కిలోమీటర్ల పొడవు, కిలోమీటరు వెడల్పు ఉన్న భూమి మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మిగతా భూమిని ప్రైవేట్ పరం చేయనున్నారు.
     
    2 వేల ఎకరాల్లోనే కార్యాలయాలు

    మొత్తం 35 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు రహదారులు, డ్రైనేజీ ఇతర నిర్మాణాలకు పోనుంది. అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయం, 60 శాఖాధిపతుల కార్యాలయాలు, అఖిలభారత సర్వీసు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో పాటు పోలీస్ పరేడ్ తదితర ప్రభుత్వ అవసరాలకు రెండువేల ఎకరాలు సరిపోతాయి. దీన్లో అసెంబ్లీ, రాజ్‌భవన్ పదేసి ఎకరాల్లోను, సచివాలయం ఐదెకరాల్లోను, 60 శాఖాధిపతుల కార్యాలయాలకు మూడేసి ఎకరాల్లో 20 అంతస్థుల భవనాలు మూడు నిర్మిస్తారు. భూ సమీకరణ రైతులకు ఇచ్చేందుకు ఎనిమిదివేల ఎకరాలు సరిపోతాయి. ఇవన్నీపోగా ప్రభుత్వానికి పదివేల ఎకరాలు మిగులుతుంది. ఇందులో ఐదువేల ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తుంది. మిగతా ఐదువేల ఎకరాలను వైద్య, విద్య, ఐటీ తదితర వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు ఇస్తుంది. ఇప్పటివరకు భూ సమీకరణ ద్వారా నాలుగువేల ఎకరాలను సేకరించారు. 20 వేల ఎకరాలు సేకరించిన తరువాత రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణ బాధ్యతలను కూడా సింగపూర్ ప్రభుత్వానికి లేదా సింగపూర్ ప్రభుత్వం సూచించిన ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకు స్విస్ చాలెంజ్ విధానాన్నిగానీ, మరో విధానాన్నిగానీ అవలంభించనున్నారు.
     
    మాస్టర్ ప్లాన్ బాధ్యత సబ్ కాంట్రాక్టర్‌కు..


    రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించామని, ఆ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. సింగపూర్ ప్రభుత్వసంస్థ మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను మరో సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది.
     
    ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా తాము సింగపూర్ ప్రభుత్వసంస్థతోనే ఒప్పందం చేసుకున్నామని, ఆ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి చేయిస్తే తమకు సంబంధం ఉండదనే ధోరణిలో వ్యవహరిస్తోంది. వాస్తవంగా గత రెండు రోజుల పాటు సింగపూర్‌కు చెందిన ప్రతినిధులు ఏడు నక్షత్రాల హోటల్‌లో బసచేయడానికి కారణం సింగపూర్ ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను జురాంగ్‌తో పాటు మరో ప్రైవేట్ కంపెనీకి అప్పగించడానికేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజధాని నిర్మాణ విషయంలో కూడా సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సంస్థలకు అప్పగించామని ఒప్పందం చేసుకుంటారని, ఆ తరువాత సింగపూర్ ప్రభుత్వం ఆ దేశానికి చెందిన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని, ఇందులో దాగి ఉన్న పరమార్థం ఇదేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అప్పుడు టెండర్లు ఏమీ ఉండవని, అటు సింగపూర్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరస్పర ప్రయోజనాలతో ఇష్టానుసారం వ్యవహరిస్తాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
     
    రాజధాని నిర్మాణానికి తక్షణ సాయంగా రూ.10 వేల కోట్లు కోరిన రాష్ట్రం

    రాజధాని నిర్మాణం కోసం మొత్తం 1.10 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, తక్షణ సాయంగా 10 వేల కోట్ల రూపాయలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇలా లేఖలు రాస్తే సరిపోదని, ఏ నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని కోరుతోంది.

మరిన్ని వార్తలు