ఇక బలవంతమే!

15 May, 2015 02:13 IST|Sakshi
ఇక బలవంతమే!

‘రాజధాని’ కోసం భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం
 
హైదరాబాద్: రైతుల అనుమతితో నిమిత్తం లేకుండా రాజధానిలో బలవంతపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారి జాతీయ స్ థాయిలో చర్చ జరుగుతున్న భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఇందుకు ఆసరాగా చేసుకుంది. నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇంతకాలం భూ సమీకరణ పాటపాడిన ప్రభుత్వం గురువారం నుంచి ‘కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టనుంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో ‘రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు’ను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. ‘భూసేకరణ చట్టం-2013’లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది.

రెండు, మూడు చాప్టర్ల నుంచి మినహాయింపునివ్వడం ద్వారా రైతుల సమ్మతి లేకుండానే భూమి లాక్కోవడానికి ప్రభుత్వానికి అవకాశం లభించడంతో పాటు, పునరావాస బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీలుంటుంది.  ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 166) జారీ చేసింది. ఆర్డినెన్స్‌లోని 10(ఎ)(1) ప్రకారం.. జాతీయ భద్రత, దేశ రక్షణకు సంబంధించిన, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, చౌక గృహనిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు, భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ఉండే పీపీపీ ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. భూసేకరణ చట్టం-2013లో ‘సామాజిక ప్రభావం అంచనా’ చాలా ముఖ్యమైన అంశం. తాజా నోటిఫికేషన్ ప్రకారం సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి అవకాశమేర్పడింది.

 2, 3 చాప్టర్లను మినహాయించడం వల్ల...

రైతుల సమ్మతి లేకుండానే భూములు సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరమే ఉండదు. భూమి యజమానులకు చట్టంలో పేర్కొన్న మేరకు రిజిస్ట్రేషన్ విలువను బట్టి పరిహారం చెల్లించి భూములు లాక్కొనే హక్కు ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. మూడు నెలల్లో పరిహారం చెల్లించడంతో పాటు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలనే నిబంధనలు లేకపోవడంతో.. ప్రభుత్వం ఇచ్చినప్పుడే  పరిహారం పుచ్చుకోవాలి.భూములపై ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతులు, కూలీల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది.

పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలనే పరిమితుల నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు. భూ సేకరణ, తర్వాత చేపట్టే నిర్మాణ కార్యక్రమాల వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినా.. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజధాని కనీస అవసరాలకే భూ సేకరణ జరగాలనే నిబంధన లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చిన మేరకు భూ సేకరణ చేయవచ్చు. ఫలితంగా అవసరాలకు మించి భూములు సేకరించి, సర్కారు పెద్దలు సొమ్ము చేసుకొనే ప్రమాదం ఉంది.{పభావిత ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగుల సంక్షేమానికి, భూసేకరణతో సంబంధం ఉన్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను రూపొందించడం, సేకరణ వల్ల ఎదురయ్యే సామాజిక ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు.మూడు పంటలు పండే భూములకు సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధన లేకపోవడం వల్ల.. మూక్కారు పండే భూములను రాజధాని కోసం సేకరించేందుకు అవరోధం ఉండదు.
 
 33,400 ఎకరాలు
 రాజధాని కోసం ప్రభుత్వం  సమీకరించదలచుకున్న భూ విస్తీర్ణం.
 
 14,800 ఎకరాలు

రైతులతో ఒప్పందాలు కుదిరిన భూమి
 
18,600 ఎకరాలు

భూ సమీకరణకు దూరంగా ఉన్న కొందరు(తొలుత అంగీకార పత్రాలు ఇచ్చినప్పటికీ) రైతుల ఆధీనంలో ఉన్న భూమి.
 
900 ఎకరాలు
 
సమీకరణకు రాని భూమి ఇంతేనని, దీన్ని భూ సేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
సవరణకు ముందున్న భూసేకరణ చట్టంలోని  చాప్టర్ 2 ఏం చెబుతోందంటే....
 
►సామాజిక ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి విస్తృత ప్రచారం కల్పించాలి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచాలి. స్థానిక సంస్థతో సంప్రదింపులు జరిపి అధ్యయనం చేయాలి. ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్) చేపట్టాలి. నిర్వాసితుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకొని నివేదికలో పొందుపరచాలి. అధ్యయనం ప్రారంభించిన మూడు నెలల్లో పునరావాస కమిషనర్‌కు నివేదిక సమర్పించాలి.

►    సామాజిక ప్రభావ అధ్యయనం (ఎస్‌ఐఏ) కోసం పునరావాస కమిషనర్ బృందాన్ని ఎంపిక చేయాలి. భూసేకరణకు దరఖాస్తు చేసిన సంస్థ ప్రతినిధులు ఎవరూ అధ్యయన బృందంలో ఉండకూడదు. సామాజిక కార్యకర్తలు, విద్యా, సాంకేతిక నిపుణులు, స్వతంత్ర ప్రాక్టీషనర్లు ఉండాలి. ప్రాజెక్టు వల్ల ప్రతికూల ప్రభావానికి గురయ్యే ప్రాంత విస్తీర్ణం, సేకరించిన ప్రాంతం మీదే కాకుండా పరిసరాలపై పర్యావరణ, సామాజిక ప్రభావాలను బృందం పరిశీలించాలి. ప్రాజెక్టు కనీస అవసరాల మేరకే భూసేకరణ జరుగుతోందనే విషయాన్ని నిర్ధారించాలి.

►    {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రొఫైల్‌ను రూపొందించాలి. సామాజిక ప్రభావ అంచనా నివేదిక తయారైన తర్వాత.. ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి అనుసరించాల్సిన ‘సామాజిక ప్రభావ నిర్వహణ ప్రణాళిక (ఎస్‌ఐఎంపీ) రూపొందించాలి. దీనికి గ్రామసభ ఆమోదం ఉండాలి.

►    సామాజిక ప్రభావ అంచనా అధ్యయన నివేదికను పరిశీలించడానికి నిపుణుల కమిటీ నియమించాలి.

 ►    {పాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 2 నెలల్లోపు ప్రభావిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలి.
 
ఆహార భద్రతను పరిరక్షించే చాప్టర్-3

రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను సేకరించాలని భావిస్తే.. అదే ఆఖరి ప్రత్యామ్నాయం అయి ఉండాలి. భూ సేకరణలో ప్రజోపయోగం ఉండి తీరాలి. ఆహార భద్రతకు భంగం కలిగించకుండా భూసేకరణ జరగాలి. ఆహార భద్రతకు భంగం కలుగుతుందని భావిస్తే.. సేకరించిన భూమికి సమానమైన బీడు భూమిని మరోచోట ముందుగా సాగుయోగ్యంగా అభివృద్ధి చేయాలి.
 
ప్రభుత్వ లెక్కలేం చెబుతున్నాయి


రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో దాదాపు 33 వేల ఎకరాలను సేకరించినట్టు, అది కూడా రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని చెబుతోంది. అయితే, ఇప్పటివరకు కేవలం 14,800 ఎకరాలకు మాత్రమే ఒప్పంద పత్రాలు అందాయని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ గురువారం చెప్పారు. అంటే సర్కారు చెబుతున్న 33 వేల ఎకరాల్లో సగానికన్నా ఎక్కువ మొత్తంలో భూములపై ఒప్పందమేదీ జరగలేదని స్పష్టమవుతోంది. రాజధాని కోసం తీసుకున్న భూములకు సంబంధించి కౌలు కింద చెల్లించాల్సిన నగదునూ స్వీకరించడానికి నిరాకరిస్తున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. దాదాపు 15 వేల ఎకరాలకు సంబంధించి రైతులు కౌలు తీసుకోలేదు.
 
ప్రయోగించే అవకాశమున్న గ్రామాలు

కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం దాని ఆధారంగా భూ సేకరణ చేయనుంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల నుంచి ఇక బలవంతంగా తీసుకోవడానికి వీలుగా ఈ నోటిఫికేషన్ ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, రాయపూడి, కురగల్లు, వెంకటపాలెం, ఎర్రుపాలెం, నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి తదితర గ్రామాల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించడానికి సర్కారు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
 
దేశంలోనే తొలి ప్రయోగం

 భూ సేకరణ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి వివాదాస్పదమైన ఆర్డినెన్స్‌ను అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చట్టంలో చేసిన మార్పులను పరిశీలించడానికి ఆ అంశంపై ఈ నెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది. చట్ట సభల తుది నిర్ణయం రాకముందే దాన్ని అమలులోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
 
 పూర్వాపరాలు

 ప్రజోపయోగ అవసరాలకు భూమిని సేకరించేందుకు 1894 నుంచి 2013 వరకు నాలుగు చట్టాలు వచ్చాయి. 2013లో తెచ్చిన చట్టం - భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునః ఉపాధి కల్పన చట్టం. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిలో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ 2014, డిసెంబర్ 31న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్ ముందుంచి చట్టం చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఆ ఆర్డినెన్స్ గడువు తీరడంతో అవే మార్పులతో ఏప్రిల్ 3న కేంద్రం మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీన్ని తాజా సమావేశాల్లో పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవాలన్న ప్రయత్నం కూడా ముందుకు కదలలేదు. విపక్షాల డిమాండ్ మేరకు ఆ అంశాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అది మళ్లీ పార్లమెంట్ ముందుకొస్తుంది. ఈ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆధారంగా గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అధికారంతో భూ సేకరణకు అడ్డంగా నిలుస్తున్న రెండు అధ్యాయాలకు మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు