భూకంప జోన్‌లో రాజధాని!

26 Apr, 2015 02:41 IST|Sakshi
భూకంప జోన్‌లో రాజధాని!

సర్వత్రా చర్చనీయాంశం
భూకంప ప్రాంతాల వర్గీకరణలో మూడో జోన్‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలు
భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారమంటున్న నిపుణులు
ఇదే విషయాన్ని తేల్చిచెప్పిన శివరామకృష్ణన్ కమిటీ

 
 సాక్షి, హైదరాబాద్: నేపాల్ కేంద్రంగా శనివారం సంభవించిన పెను భూకంపం తాలూకా ప్రకంపనలు దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నూతన రాజధాని ప్రాంతంలోనూ రావడం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం ఏపీ కొత్త రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రాంతం భూకంప జోన్‌లో ఉండడమే. అదేవిధంగా ఈ ప్రాంతంలోని భూమి పూర్తిగా నల్ల రేగడి నేల కావడం, వదులుగా ఉండటం. దీంతో ఈ ప్రాంతంలో చేపట్టబోయే నిర్మాణాలు భూకంపాలను తట్టుకోగలిగే నైపుణ్యంతో నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పైగా రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతమంతా కృష్ణానది పరివాహక ప్రాంతం కావడం వల్ల కూడా నిర్మాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం వరదలు సంభవించే ప్రాంతమే కాకుండా శ్రీశైలం, నాగార్జున్ సాగర్, పులిచింతల ప్రాజెక్టుల కింద భాగంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓ అధికారిపేర్కొన్నారు.
 
 దేన్నైనా తట్టుకునే నిర్మాణాలు అవసరం
 భూకంపాన్ని ముందస్తుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భూకంప జోన్లను గుర్తించినప్పటికీ అక్కడ ఎప్పుడు భూమి కంపిస్తుందో తెలుసుకునే పరిజ్ఞానం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లోను అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్‌కోలోను భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో నిర్మాణాలను చేపట్టారని ఒక అధికారి తెలిపారు.
 
 సహజ సంపద తోడేయడం కూడా
 పెద్ద ఎత్తున చమురు, సహజవాయువుల్ని వెలికితీయడం వల్ల భూమి లోపలి పొరల్లో ఖాళీ ఏర్పడి భూకంపాలకు దారితీస్తోందని కృష్ణా, గోదావరి జిల్లాల్లో పలు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ఆంధ్రా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, భూగర్భ శాస్త్ర నిపుణుడు జీవీ కృష్ణారావు ‘సాక్షి’కి చెప్పారు.  కొన్ని దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ వెలికితీసిన తర్వాత అదే మోతాదులో ఇసుక, నీటిని భూమిలోకి నింపి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
 
 అందుకే వద్దంది!
 రాజధాని ప్రాంతమైన అమరావతి, ఉండవల్లిలో శనివారం కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ ప్రాంతంపైనే పడింది. రాజధాని నిర్మాణంపై గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో కూడా ఈ ప్రాంతం భూకంప జోన్‌లో ఉన్నట్టు ఎన్‌జీఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ చెప్పారు. 2000 సంవత్సరం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూకంపంలో రెండు, మూడో జోన్లలో ఉంది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలు మూడో జోన్‌లో ఉండగా అనంతపురం రెండో జోన్‌గా ఉంది. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టాలు మూడో జోన్‌లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీ రెండో జోన్‌లో ఉంది. అలాగే కష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజవాయు నిక్షేపాలను ఏళ్ల తరబడి తోడేయడంతో భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని అనేకమార్లు భూగర్భ శాస్త్ర నిపుణులు హెచ్చరించారు.  
 
 అది ప్రభావిత ప్రాంతమే
 ‘భూకంప ప్రాంతాల వర్గీకరణ ప్రకారం.. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలు మూడో జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6గా నమోదయ్యే అవకాశముంది. అంటే ప్రభావం తీవ్రం. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే తొలుత జియో టెక్నికల్ స్టడీ చేయాలి.  భూగర్భం వదులుగా ఉన్నట్టు తేలితే భవంతుల నిర్మాణానికి ఆధునిక పరిజ్ఞానం వినియోగించాలి.’     - ఆర్‌కే చద్దా, ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త
 

మరిన్ని వార్తలు