రాజధాని గ్రామాల్లో బంద్‌ ప్రశాంతం

20 Dec, 2019 04:38 IST|Sakshi

ఉదయాన్నే రోడ్ల మీదకు చేరుకున్న రైతులు

సీఎం జగన్‌ తన ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి బ్యూరో: అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొనడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన మొదలైంది. సీఎం తన ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల ప్రజలు గురువారం బంద్‌ నిర్వహించారు. ఉదయాన్నే రోడ్లమీదకు వచ్చి పాఠశాలలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులను మూసివేయించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తుళ్లూరు, మందడంలో రైతులు రోడ్లపై బైఠాయించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్‌ చేశారు.  

బంద్‌ పాక్షికం
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చినా, కొన్ని గ్రామాల్లో ప్రజలు బంద్‌కు మద్దతునివ్వలేదు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో బంద్‌ ప్రభావం కనిపించలేదు. మంగళగిరి పరిధిలోని యర్రబాలెం, నవలూరులోనూ బంద్‌ పాక్షికంగానే కొనసాగింది. తుళ్లూరు మండల పరిధిలోని వెంకటపాలెం, మందడం, తుళ్లూరులో మాత్రమే బంద్‌ సంపూర్ణంగా సాగింది. పాలన వికేంద్రీకరణపై రైతుల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతిలో రాజధానిని టీడీపీ నాయకులు స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సామాన్యులెవరూ లబ్ధి పొందలేదని వారు పేర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో బంద్‌ నేపథ్యంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేశారు.  

మరిన్ని వార్తలు