భారీగా గంజాయి పట్టివేత

7 Aug, 2014 01:33 IST|Sakshi
భారీగా గంజాయి పట్టివేత

పాడేరులో 200, గొలుగొండలో 40, చింతపల్లిలో 20 కిలోల స్వాధీనం  ముగ్గురు తమిళ వ్యాపారుల అరెస్ట్  జిల్లా రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్, ఎక్సైజ్ శాఖ డెప్యుటీ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు ఎక్సైజ్ అధికారులు కదిలారు. ఏజెన్సీ నుంచి భారీగా జరుగుతున్న గంజాయి రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఫలితంగా ఏజెన్సీలో మూడు చోట్ల బుధవారం మొత్తం 260 కిలోల గంజాయి దొరికింది. ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఆ నిందితులంతా తమిళనాడుకు చెందిన వ్యాపారులు.
 
పాడేరు : జి.మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతం నుంచి పాడేరు మీదుగా అనకాపల్లికి గంజాయితో వెళ్తున్న జీపును బుధవారం తెల్లవారుజామున పాడేరు ఎక్సైజ్ అధికారులు బొక్కెళ్ళు సమీపంలో పట్టుకున్నారు. అయితే ఆ జీపులో ఉన్నవారు తప్పించుకొని పరారయ్యారు. ఏపీ 35 యు 4353 నంబరుగల జీపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. జీపు రికార్డుల ఆధారంగా నిందితుల ఆచూకీ కనుక్కొంటామని చెప్పారు. ఈ దాడుల్లో మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర, స్థానిక స్టేషన్ ఎస్సైలు గంగాధరం, జ్ఞానేశ్వరి, హెచ్‌సీలు వర్మ, శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 
చింతపల్లి రూరల్: ఏజెన్సీ నుంచి తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళులను అరెస్ట్ చేసినట్లు అన్నవరం ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా పనసలపాడు గ్రామం వద్ద అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశామన్నారు. జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి పంచాయతీ మారుమూల గ్రామాల నుంచి కాలిబాటన వస్తున్నవారి వద్ద 20 కేజీల గంజాయి దొరికిందని చెప్పారు. సుమారు రూ. 40 వేల విలువైన ఆ గంజాయిని స్వాధీనం చేసుకొని, తమిళనాడుకు చెందిన కొటియన్ (35), ముత్తయ్య (39), మురుగేషన్ (45)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
 
గొలుగొండ: కేడీపేట నుంచి నర్సీపట్నం వైపు
 
తరలిస్తున్న 40 కిలోల గంజాయిని గొలుగొండ పోలీసులు బుధవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి మండలం వంగసార గ్రామానికి చెందిన ఎస్.బాల మురళీకృష్ణను అరెస్టు చేశారు. అతను మోటార్ బైక్‌పై గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్సై జోగారావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు