అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

8 May, 2016 02:11 IST|Sakshi
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కనకదుర్గమ్మ వారిధి చెక్‌పోస్టు వద్ద
ఆకస్మిక తనిఖీలు
220 క్వింటాళ్లు స్వాధీనం.. అదుపులోకి ముగ్గురు

 
 
విజయవాడ(కృష్ణలంక) : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వై.టి.నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ శనివారం కనకదుర్గమ్మ వారధి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 ఈ మేరకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచి అక్రమంగా తరలి వెళుతున్న లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంను పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం దాచేపల్లిలో ఏపీ05టిఎ4 417 లారీలో నల్గొండ తిప్పర్తికి చెందిన పలువురు ఆటోల్లో తీసుకువచ్చిన రేషన్ బియ్యంను 445 సంచుల్లో 220 క్వింటాళ్ల లోడు ఎక్కించారు. గుంటూరు జిల్లా పొందుగల, కొండముడు చెక్‌పోస్ట్‌లను దాటుకుని వారధికి చేరుకుని విజిలెన్స్ తనిఖీకి చిక్కింది. ఈ మేరకు డ్రైవర్ దారపడ శ్రీను, క్లీనర్ మట్టా శ్రీను, బియ్యం తరలించే మధ్యవర్తి కదిమళ్ల నరేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి షిప్‌పై రాయపూర్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ ఎన్.ఎస్.అపర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు శర్మ, మున్వర్ ఈ దాడిలో పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు