సీపీ కార్యాలయం ఎదుట కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

21 Jun, 2015 02:22 IST|Sakshi
సీపీ కార్యాలయం ఎదుట కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

- చిట్టీల సొమ్ము రాబట్టుకునేందుకే    
విజయవాడ సిటీ :
చిట్టీల సొమ్మును నిర్వాహకుడు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన కారు డ్రైవర్ పెయ్యల సుబ్బారావు(38) శనివారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసు వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
ఇదీ జరిగింది
పాత రాజరాజేశ్వరిపేటకే చెందిన అర్జునరావు వద్ద సుబ్బారావు ప్రైవేటుగా చిట్టీలు కట్టాడు. ఇతనికి రూ.2.47లక్షల సొమ్ము రావాల్సి ఉంది.  అర్జునరావు ఆర్థికంగా దివాళా తీసి, చిట్టీల సొమ్ము చెల్లించలేక ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు. పెద్ద మనుషుల సమక్షంలో రూ.1.50 లక్షలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇంటిని కొనుగోలు చేయనున్న రాము వద్ద రూ.1.50 లక్షలకు అర్జునరావు సలహా మేరకు సుబ్బారావు రెండు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. గత మార్చిలో ఆ మొత్తాన్ని ఇతర బాకీదారుల సమక్షంలో సుబ్బారావు తీసుకున్నాడు. వాపసు చేయాల్సిన రెండు ప్రామిసరీనోట్లకు గాను ఒకటే ఇచ్చి మిగిలిన దానిని తన వద్దనే అట్టిపెట్టుకున్నాడు.

వారు ప్రామిసరీ నోట్లు అడిగితే మిగిలిన సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. పైగా తరుచూ వెళ్లి డబ్బుల కోసం వారిని వేధింపులకు గురి చేయడంతో అర్జునరావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు సుబ్బారావుతో పాటు నగదు తీసుకున్న సమయంలో ఉన్న ఇతర బాకీదారులను పోలీసులు పిలిపించి విచారించారు. నగదు తీసుకున్నందున ప్రామిసరీ నోటు తిరిగి ఇచ్చేయమని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ భావించిన సుబ్బారావు.. ఈ నెల 15న సీపీని కలిసేందుకు వెళ్లగా వీలు చిక్కలేదు.

శనివారం మధ్యాహ్నం మరోసారి సీపీని కలిసేందుకు వెళ్లాడు. సెంట్రల్ కంప్లయింట్ సెల్ అధికారులు అతడిని వివరాలు అడిగి, కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్టేషన్‌కి వస్తే సమస్య పరిష్కరిస్తామని వారు చెప్పారు. దీంతో   సుబ్బారావు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బా గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
 
గతంలో కూడా..
సుబ్బారావు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసిందని కొత్తపేట ఇన్‌స్పెక్టర్ నిమ్మకాయల దుర్గారావు తెలిపారు. అర్జునరావు ఫిర్యాదు మేరకు ఇతరులతో పాటు సుబ్బారావును కూడా పిలిపించి విచారించామని చెప్పారు. డబ్బులేమైనా రావాల్సి ఉంటే చట్టపరంగా చూసుకోవాలని, ఇంటికి వెళ్లి గొడవ చేయవద్దని చెప్పినట్టు తెలిపారు. వేరే కేసులో మచిలీపట్నం ఆర్‌పేట ఎస్‌ఐ తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ గతంలో ఇతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు