షాడో మినిస్టర్‌

21 Nov, 2018 09:00 IST|Sakshi
సొంత థియేటర్‌ కోసం ప్రభుత్వ సొమ్ముతో వేసిన సిమెంట్‌ రోడ్డు

అంతా ఆయన కనుసన్నల్లోనే

పేకాట క్లబ్‌లు, ఇసుక ర్యాంపుల్లో వాటాలు

మద్యం సిండికేట్‌ కూడా ఆయన గుప్పిట్లోనే

పేకాట క్లబ్‌ నిర్వహణ... ఇసుక, మద్యం మాఫియాలకు కొవ్వూరు నియోజకవర్గం కేరాఫ్‌ అడ్రస్‌గా తయారైంది. రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పేరుకు జవహర్‌ మంత్రి అయినా పెత్తనమంతా ఈయనే చక్కపెడుతుంటారని ఆయన అనుయాయులు చెప్పుకుంటారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  కొవ్వూరులో పేకాట క్లబ్‌ల నిర్వహణ, ఇసుక ర్యాంపుల్లో వాటాలు, మద్యం దుకాణాల సిండికేట్‌ మొత్తం ఆ నేత కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. నెలవారీగా మామూళ్లు ముట్టజెప్పుతూ నియోజకవర్గంలోని అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటారని సమాచారం. ఈ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా నాయకులు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే. మొదటి నుంచి మంత్రి వెనుక ఉండి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి సైతం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సిందే. మంత్రిగారు కూడా ఆయన మాట జవదాటరనే ప్రచారం ఉంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, ఆ పనులపై పర్సంటేజీలు అన్నీ ఆయన కనుసైగల్లోనే సాగుతాయి.  ఈయనపెత్తనం ఎక్కువ అవ్వడంతో మిగిలిన వర్గాలు మంత్రికి దూరంగా జరిగారు. ఇప్పుడు నియోజకవర్గంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ నేతకి వ్యతి రేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో పాటు ఇక్కడ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

క్లబ్‌ నిర్వహణతో నెలకు రూ.కోటికిపైగా ఆదాయం
పట్టణం నడిబొడ్డులో పేకాట క్లబ్‌ ద్వారా నెలకి రూ.కోటి రూపాయల వరకు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. దీనిలో ముఖ్య ప్రజాప్రతినిధికి కూడా వాటాలు అందుతున్నట్టు ప్రచారం ఉంది. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన నాయకులే ఈ క్లబ్‌ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు నాయకులు చెబుతున్నారు. జవహర్‌ మంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి క్లబ్‌లో పేకాట జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇసుక ర్యాంపుల్లో వాటాలు
నియోజకర్గంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఉన్న ఇసుక ర్యాంపుల్లో ఈ నేతకు వాటలు పంపితేనే ర్యాంపులు నడుస్తాయి. మామూళ్లు అందకపోతే ఏవేవో కారణాలు చూపి కొర్రీలు పెట్టి ర్యాంపులు మూయించి వేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా సీతంపేట నుంచి పశ్చిమ డెల్టా కాలువలో ఇసుక పడవలు నడుపుకోవడానికి నెలకి ఒక్కో పడవ నిర్వాహకుడు రూ.20 వేలు చొప్పున మామూళ్లు ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ నలభై పడవలు వరకు నడుస్తున్నాయని చెబుతున్నారు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో డ్రెడ్జర్ల సాయంతో గత ఏడాది తవ్వకాలు సాగించారు. ఆ  సమయంలో రోజుకి రూ.ఐదు లక్షలు చొప్పున మామూళ్లు తీసుకునే వారని సమాచారం. ఇది కాకుండా అవసరమైనప్పుడల్లా ర్యాంపుల్లో నిర్వాహకులు ఇసుక కేటాయించాల్సిందే.

ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు
రాష్ట్రంలో ఎక్కడ ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు సాగినా ఈ నియోజకవర్గంలో మాత్రం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా చెల్లించాల్సిందే. ఈ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా అన్ని మద్యం దుకాణాలు ఈయన అధీనంలో ఉన్న సిండికేట్‌లోనే ఉన్నాయి. వీటితో పాటు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో కొన్ని దుకాణాలను ఈయన కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి నియోజకవర్గం కావడంతో మంత్రిని అడ్డుపెట్టుకుని అడ్డు అదుపు లేకుండా బెల్టుషాపులు నడుపుతున్నారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఈ బెల్టు దుకాణాల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఏదైనా ఫిర్యాదులు అంది నప్పుడో, ప్రతికల్లో కథనాలు వచ్చిన సందర్భాలోను మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు.

సినిమా టిక్కెట్లనూ వదలడం లేదు
సినిమాలపై కూడా ఈ నేతదే పెత్తనం. ఆయన సొంత థియేటర్లతో పాటు మిగిలిన థియేటర్లలో కూడా ఏదైనా ప్రముఖ హీరో సినిమా విడుదలైందంటే టిక్కెట్లు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు రెట్లు అధిక రేట్లు పెట్టి మరీ గుం జుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రేక్షకుల జేబు లకు చిల్లు పడుతోంది. రోజు వారీ టిక్కెట్లు సైతం రెట్టింపు రేట్లుకి విక్రయాలు సాగిస్తున్నా, రాత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఇక్కడి అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదు.

థియేటర్‌ కోసం సిమెంటు రోడ్డు
నియోజకవర్గంలో నేటికీ అనేక ప్రాంతాల్లో సరైన రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవేం పట్టించుకోకుండా ఆ నేత వాటాదారుడిగా ఉన్న సినిమాహాలు కోసం ఇటీవల తాళ్లపూడిలో జనావాసాలు లేని చోట సుమారు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు వేయడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ గ్రాంట్, ఉపాధిహామీ, గ్రామ పంచాయతీ నిధులతో ఈ రోడ్డు నిర్మించారు. కొవ్వూరులో కూడా ఆయన థియేటర్‌ వీధిని విస్తరించి, సెంట్రల్‌ లైటింగ్‌తో  సుందరంగా తయారు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు