పేక ముక్క మాటున.. అంతా ‘మామూళ్లే..’

23 Nov, 2018 07:45 IST|Sakshi

తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో జోరుగా పేకాట క్లబ్‌లు

వాటాలు అందడంతో నోరెత్తని పోలీసులు

రోజూ చేతులు మారుతున్న రూ.లక్షలు

తూర్పుగోదావరి , కాజులూరు/ కె.గంగవరం ,రామచంద్రపురం: రామచంద్రపురం మండలం వెలంపాలేనికి చెందిన ఓ యువకుడు పేకాటలో రూ.లక్షలు పోగొట్టుకుని ఇటీవల ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతడే కాదు.. ఎందరో ఇలా పేకాటలో తమ తలను తాకట్టుపెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే రామచంద్రపురం నియోజకవర్గం, పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార పార్టీకి చెందిన కొందరు ఈ పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఇదే పేకాట క్లబ్‌ల నుంచి సొమ్ములు తీసి అందించాలని నిర్ణయించడం తెలుగు తమ్ముళ్లకే చెల్లిందని పలువురు విమర్శిస్తున్నారు.

సంపాదనే ధ్యేయంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే క్లబ్‌లను నిర్వహిస్తూ నెలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా రామచంద్రపురం పట్టణంలోను యథేచ్ఛగా పేకాట క్లబ్‌లను టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఎరచూపి ఈ క్లబ్‌లనున నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామచంద్రపురం పట్టణంలో నాలుగు చోట్ల, రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలోని కోటిపల్లి రోడ్డులో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ భవనాల్లో, తోటపేటలోని ఒక ప్రవేటు భవనంలో ప్రతి రోజూ పేకాటలను నిర్వహిస్తున్నారు. కె.గంగవరంలో కూళ్ల, కె.గంగవరం, కాజలూరు మండలంలోని గొల్లపాలెం, కాజులూరు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుల నేపథ్యంలో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం వరకు రామచంద్రపురం మండలంలోని చోడవరంలో, నరసాపురపుపేటలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి మరీ పేకాట క్లబ్‌లను నిర్వహించగా, జిల్లా స్థాయి పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి అరికట్టారు. రెండు, మూడు నెలలుగా తిరిగి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు జోరందుకున్నాయి. ఆయా క్లబ్‌లకు వెళ్లే వారి నుంచి పేకాట ఆడేందుకు ప్రతి ఒక్కరూ 24 గంటలకు రూ.వెయ్యి ఫీజు కట్టాలి. ఇలా ప్రతి క్లబ్‌ల నుంచి ప్రతి రోజూ రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. రామచంద్రపురం పట్టణంతో పాటుగా ద్రాక్షారామలోని క్లబ్‌ల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.లక్ష వరకు ప్రవేశ రుసుంగా వసూలు చేస్తుండగా, ప్రతి నెలా రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు క్లబ్‌ల ద్వారా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంట్లో పోలీసులకు ప్రతినెలా రూ.నాలుగు లక్షల వరకు అందించగా క్లబ్‌ల నిర్వహణకు రూ.ఐదు లక్షల వరకు తీసి మిగిలిన సొమ్ములను అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలు ఒక్కొక్కరూ రూ.మూడు లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పంచుకుంటున్నారు. పేకాడుతున్న వారి నుంచి దోచుకుంటున్నారు. ప్రతి నెలా పోలీసులకు మామూలుగానే  డివిజన్‌ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇస్తున్నామని; అందుకే ఇంత స్వేచ్ఛగా ఆడుకోగలుగుతున్నామని పేకాటరాయుళ్లే అంటుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.

దగ్గరుండి మరీ ఆడిస్తున్నారా?
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రోజు వారీ కూలీలు కూడా ఈ పేకాట క్లబ్‌లను వెళుతూ కుటుంబాలను వీధిన పడేస్తుంటే వాటిని అరికట్టాల్సిన అధికార పార్టీ నేతలు వాటిని దగ్గరుండి మరీ ఆడిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తుందని నియోజకవర్గ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు నాశనం అవుతుంటే క్లబ్‌లపై దాడులు చేసి అరికట్టాల్సిన పోలీసులు తీరుపై పేకాటతో నష్టపోయిన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని పేకాట క్లబ్‌లను అరికట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు