జీవిత చక్రం తిరగబడింది!

28 Jan, 2019 12:43 IST|Sakshi
భార్య, పిల్లలతో అంగడి షేక్‌ దాదాపీర్‌

కార్పెంటర్‌ కుటుంబంపై విధి చిన్నచూపు

వైద్యం కోసం 4 ఎకరాల భూమి విక్రయం

కూలి పనులకెళ్లలేని దైన్యం

మందుల కొనుగోలుకు కష్టం

కుటుంబ పోషణ భారం

జీవితం.. కష్ట సుఖాల కలయిక సాగిపోయినంత వరకూ సాఫీనే.. ఆగిపోతే బండికాదు..మొండి కుటుంబం ఒడిదుడుకులు లేకుండా నడిచిందంటే.. జీవితం బాగుందంటే దానికో అర్థం..అవయవయాలన్నీ సక్రమంగా ఉంటే అందం.. ఆనందం అన్నీ సమ‘పాల’లా కలిసుంటే ఆరోగ్యం.. అదే మహాభాగ్యం..ఆయుష్షు బాగుంటే.. ప్రయాణం ప్రశాంతం అంటాం..లేదంటే ‘విధి’ అంటాం.. అదీ కాదంటే ‘కర్మ’ అనుకుంటాం.
ఆ కుటుంబ దయనీయ గాథ ఇలాంటిదే..చిన్న కుటుంబం.. చింతలేదనుకున్నారు. అప్పుడే కష్టాల కడలి వారింటి తలుపు తట్టింది..కిడ్నీ వ్యాధి రూపంలో కీడుతలపెట్టింది.. దయలేని దారిద్య్రంపట్టి పీడిస్తోంది.  మానవత్వం మనిషి రూపంలో ఉంటుందనే ఒకే ఒక్క ఆశ..రేపటి నవోదయం దిశగానిరుపేద కళ్లు నిరీక్షిస్తున్నాయి.

అనంతపురం, వజ్రకరూరు: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కార్పెంటర్‌ దంపతులు చికిత్స, కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వజ్రకరూరు మండలం గంజికుంటకు చెందిన అంగడి షేక్‌ దాదాపీర్‌ కార్పెంటర్‌. ఇతనికి 2009 సంవత్సరంలో గుంతకల్లు పట్టణానికి చెందిన సహేరాబానుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మహమ్మద్‌ నజీబ్‌ రెండో తరగతి, కుమార్తె సనాకౌసర్‌ ఎల్‌కేజీ చదువుతున్నారు. దాదాపీర్‌కు పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంది. ఈ విషయం రెండేళ్ల కిందట బయటపడింది. కిడ్నీ వద్ద నొప్పిగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స కోసం దాదాపు రూ.3లక్షల దాకా ఖర్చయ్యింది. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులో చేరాడు. వైద్య పరీక్షల్లో కిడ్నీ ఫెయిలైనట్లు తేలింది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (కిడ్నీ మార్పిడి) చేయాలని వైద్యులు స్పష్టం చేశారు.

భర్తకు కిడ్నీ దానం చేసిన భార్య
దాదాపీర్‌కు అన్న, నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వీరిలో ఎవరివీ సరిపోకపోవడంతో చివరకు భార్య తన రెండు కిడ్నీల్లో ఒకదానిని భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2016 జూలైలో ప్రభుత్వ నిబంధనల మేరకు భార్య కిడ్నీని భర్తకు అమర్చారు. చికిత్స కోసం రూ.19 లక్షల దాకా అప్పు చేశారు. ఈ అప్పు తీర్చడానికి నాలుగు ఎకరాల భూమిని అమ్మితే రూ.15 లక్షలు వచ్చింది. ఆర్డీటీ సంస్థ రూ.రెండు లక్షల ఆర్థిక సాయం అందచేసింది. ప్రస్తుతం భార్యాభర్తలు బరువైన పనులు చేయలేని పరిస్థితి. ఇంటి పట్టునే ఉంటున్నారు. వీరిద్దరికీ ప్రతి నెలా వైద్య పరీక్షలు, దాదాపీర్‌కు మందులు కొనడానికి రూ.15 వేల దాకా ఖర్చు వస్తోంది.

బతుకు భారం..
కార్పెంటర్‌ దంపతులకు ఆరోగ్యం సహకరించకపోవడంతో సంపాదించలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కార్పెంటర్‌ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. తమ దీన పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పింఛన్‌ కానీ, పక్కా గృహం కానీ మంజూరు చేయలేదు. పాత ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, దయార్ద్ర హృదయులు మానవతా దృక్పథంతో ఆలోచించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ కష్టం ఎవరికీ రాకూడదు
ఇలాంటి కష్టం ఏ ఒక్కరికీ రాకూడదు. కిడ్నీ సమస్య కారణంగా ఉన్న భూమిని అమ్ముకుని అప్పులు చెల్లించా. మందులు కొనడానికి ప్రతినెలా రూ. 15 వేలు ఖర్చు అవుతోంది. పని చేద్దామన్నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. కనీసం పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు.– అంగడి దాదాపీర్, సహేరాబాను

ఆర్థికసాయం చేయదలిస్తే..
పేరు : షేక్‌ దాదాపీర్‌
అకౌంట్‌ నంబర్‌ : 31643093766
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వజ్రకరూరు
ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐఎన్‌0002804
సెల్‌ నంబర్‌ : 90140 32275, 91770 45452

మరిన్ని వార్తలు