చున్నీతో చంపిన గిరిజన యువతిపై కేసు నమోదు

20 Sep, 2013 20:54 IST|Sakshi

మద్యం మత్తులో తనపై అత్యాచారానికి యత్నించిన మృగాడి మెడకు చున్నీ బిగించి, రాయితో కొట్టి చంపినందుకు గిరిజన యువతిపై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర పెదశాఖ పంచాయతీ జల గ్రామంలో కొండ సమీపాన పాకలో బుధవారం రాత్రి ఆ యువతి నిద్రపోతోంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గిరిజనుడు కడ్రక తిరుపతి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడిని చున్నీతో చుట్టి బయటికి గెంటేశానని, తర్వాత ఏమైందో తనకు తెలియదని యువతి తెలిపింది.

అయితే.. ఆత్మరక్షణ కోసమే అయినా వ్యక్తిని చంపినందుకు ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడ్రక తిరుపతి మద్యం మత్తులో ఉండటం వల్లే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చున్నీ మెడకు బిగించడంతో పాటు రాయితో తలపై కొట్టడం వల్ల తలకు తీవ్ర గాయం కావడం వల్లే అతడు మరణించినట్లు తేలింది. ఆ మహిళను మాత్రం ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.

మరిన్ని వార్తలు