అన్నం పేరుతో శఠగోపం!

20 Oct, 2013 00:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా పనిచేస్తున్నట్టు నమ్మించిన ఓ సంస్థ అన్నదానం పేరుతో శఠగోపం పెట్టింది. దాతల నుంచి విరాళాలు సేకరించి 18 నెలల పాటు శ్రీవారి మెట్లమార్గంలో భక్తులకు అన్నదానం చేసిన సంస్థ వారం రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయింది. ఈ సంస్థ దాతల నుంచి కోట్ల రూపాయ లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. తమది పేరున్న ఓ మఠానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ అని, శ్రీవారి మెట్లమార్గంలో భక్తులకు అన్నదానం చేస్తామంటూ అక్షయ ఫౌండేషన్ టీటీడీ వద్దకు వచ్చింది.
 
 

టీటీడీకి అనుబంధం అంటూ ‘డొనేట్ అజ్’ అనే స్లోగన్‌తో ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. సంస్థ నిర్వాహకుడు బాలరాజు అలియాస్ బాలాజీదత్ శ్రీవారిమెట్ల మార్గంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ప్రారంభించారు. దీనికి అప్పటి ఈవో, జేఈవోలు ఎల్వీ సుబ్రమణ్యం, వెంకటరామిరెడ్డితో, ట్రస్టుబోర్డు చైర్మన్ బాపిరాజు కూడా హాజరయ్యారు. తర్వాత అన్న ప్రసాదాలను అందజేసే విధానాన్నీ వీడియోలో చిత్రీకరించి, ఆ వీడియోలను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు పంపి దాతల నుంచి భారీగా విరాళాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 

కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడి నుంచి రూ.15 లక్షలు విరాళంగా తీసుకోగా, అనుమానం వచ్చిన ఆ భక్తుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించడంతో అక్షయ ఫౌండేషన్ బండారం బయటపడింది. కాగా, అక్షయ ఫౌండేషన్ విరాళాలు సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని విజిలెన్స్ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. కేసు నమోదు చేశామని, సేకరించిన విరాళాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు