ఫోన్ కాల్‌ : రూ. 5.1 లక్షలు హాంఫట్

6 Jun, 2015 13:29 IST|Sakshi
ఫోన్ కాల్‌ : రూ. 5.1 లక్షలు హాంఫట్

కాకినాడ:  ఫోన్ కాల్‌తో రూ. 5.1 లక్షలు హాంఫట్ చేసిన వైనమిది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఏటీఏం వివరాలు తెలుసుకుని కొద్ది గంటల వ్యవధిలోనే మొత్తం సొమ్ములు డ్రా చేశాడు. ఈ  ఘటనపై బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మారేడుబాక ఫైర్‌స్టేషన్ సమీపంలో నివసిస్తున్న శీలం వీరబాబు అనపర్తిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ. 5.1 లక్షలు డిపాజిట్ చేశాడు. గత నెల 26 ఉదయం వీరబాబుకు ఫోన్‌కాల్ వచ్చింది.
 
 బ్యాంకు నుంచి ఫోన్ చేసున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాకు అయ్యింది. ఫిన్ నంబరు, కార్డు వెనుక వైపున ఉన్న నంబరు, మీ వివరాలు చెప్పాలంటూ అడిగిన ప్రశ్నలన్నింటి కీ వీరబాబు సమాధానమిచ్చాడు. కొద్ది వ్యవధిలోనే వీరబాబు సెల్‌కు పాస్ వర్డ్‌లతో కూడిన నంబర్లు రావడం, ఏటీఎం కార్డు వినియోగంలోకి తీసుకు వస్తున్నాం మెసేజ్‌లోని పాస్ వర్డ్ చెప్పమంటూ ఆజ్ఞాత వ్యక్తి కోరాడు. ఈ విధంగా దాదాపు 13 సార్లు వీరబాబుకు వచ్చిన పాస్‌వర్డ్ వివరాలను అజ్ఞాత వ్యక్తి తెలుసుకున్నాడు.
 
 రాత్రికి చార్జింగ్ లేక సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జింగ్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం ఆన్ చేసుకుని చూసేసరికి అకౌంట్‌లో నగదు డ్రా చేసినట్టు మెసేజ్‌లు ఉన్నాయి. ఆందోళనకు గురైన వీరబాబు అనపర్తి వెళ్లి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆన్‌లైన్‌లో అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు డ్రా చేసుకున్నారు కదా అంటూ ఎదురు ప్రశ్నించడంతో తాను మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు