జీడి పరిశ్రమల బంద్

9 Mar, 2016 00:44 IST|Sakshi

 పలాస: ప్రభుత్వ విధానాలపై జీడి పరిశ్రమల యాజమాన్యాలు భగ్గుమన్నాయి. విదేశీ జీడిపిక్కల దిగుమతిపై పన్ను విధింపులకు నిరసనగా పరిశ్రమలను మంగళవారం మూసివేశాయి. పారిశ్రామిక వాడలో మొత్తం 40 పరిశ్రమలు బంద్ పాటించాయి. దీంతో వందలాది మంది కార్మికులకు పని కరువైంది. విదేశీ జీడి పిక్కలపై దిగుమంతి సుంకం 9.35 శాతం విధించడం వల్ల ఏడాదికి సుమారు రూ. 100కోట్లు పన్ను భారం పడుతుందని  జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు తెలిపారు.
 
 దీనిని తక్షణమే తగ్గించాలని కోరారు. పలాస పరిసర ప్రాంతాల్లోని సుమారు 300 జీడి పరిశ్రమలకు స్వదేశీ పిక్కలు సరపోవడం లేదన్నారు. విదేశీ పిక్కలు పప్పును స్వదేశీ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నందున పన్ను పోటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. పన్నులు తగ్గించకుంటే చాలా పరిశ్రమలు మూతపడడం ఖాయమని అభిప్రాయపడ్డారు. జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి తూములు శ్రీనివాసరావు, కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
 
 పన్ను రాయితీ ఇవ్వాలి
 పలాస జీడి పరిశ్రమలకు 75 శాతం విదేశీ జీడిపిక్కలు దిగుమతి అవుతున్నాయి. 9.35 శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల పన్ను భారం పడుతుంది. ఇప్పటికే పరిశ్రమలు ముడిసరుకు లేక మూతపడుతున్నాయి. పన్నురాయితీ ఇవ్వకపోతే మొత్తం పరిశ్రమలు మూతపడే దుస్థితి ఏర్పడుతుంది.   -పి.చంటి,  వేదమాత కాష్యూ ఇండస్ట్రీ
  యజమాని, పలాస పారిశ్రామికవాడ
 
 జీవనోపాధికి ఇబ్బంది
 మా కుటుంబంతో సహా జీడి పరిశ్రమల్లో పనిచేయడానికి వలస వచ్చాం. జీడి పరిశ్రమలు తప్ప మరో ఉపాధి మార్గంలేదు. పరిశ్రమలు మూతపడడంతో జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోంది.        -గసియా గౌరంగో,
 సరియాపల్లి, జీడి కార్మికుడు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు