ఎన్నికల వేళ ఓటరుకో మాట 

11 Apr, 2019 07:16 IST|Sakshi

 మనసు ఊరుకో ‘లేఖ’

సంధించు.. ఓటు అస్త్రం 

సాక్షి, వేలేరుపాడు: కాలం కరిగిపోయింది.. మరో ఐదేళ్లు మనల్ని పాలించే నేతలను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఈ రోజు ఓట్ల పండుగ.. ఈ ఒక్కరోజు ఓటరుగా నువ్వేరాజువి. నిర్లక్ష్యాన్ని వీడు.. పోలింగ్‌ కేంద్రం వైపు నడు.. ఓటు అస్త్రాన్ని సంధించు.. నీ ఓటు పాలకులకు బాట కావాలి.. స్వార్థపరులకు వేటు కావాలి.. వంగి.. వంగి.. దండాలు పెట్టే నేతలంతా మట్టి కరవాలి.. ఎన్నికల వేళ నీ ఓటు ఎంత అమూల్య మైందో గుర్తించు.. అందుకే మరోసారి చెబుతున్నా.. ఐదేళ్లు మన తలరాతలను మార్చే మంచి నేతకు ఓటెయ్యి.. ఎన్నికల రోజు నా మనసు ఊరుకోలేక ఇదంతా చెబుతున్నా..! ఇంతకీ నేనెవరో మీకు చెప్పనే లేదు కదా.. నేను మీ పల్లె తల్లిని.. మీ క్షేమాన్ని.. నా అభివృద్ధిని కాంక్షిస్తూ.. ఓ మంచి మాట చెబుదామని మీ ముందుకొచ్చిన నా మొర ఒక్కసారి వినండి.. మంచి ఏదో.. చెడు ఏదో ఒక్కక్షణం ఆలోచించండి. ఐదువందలకో.. వెయ్యికో.. రెండువేలకో.. మద్యం సీసాలకో.. చీరకో మీ విలువైన ఓటును అమ్మకండి అందుకే చెబుతున్నా.. తస్మాత్‌ జాగర్త.

72 ఏళ్లుగా మిమ్మల్ని.. నన్ను పాలిస్తున్న  నేతలు ఏం ఒరగబెట్టారు ‘నమ్మినాన బోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు. వాళ్లు అబద్దపు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతున్నారు. కులం, ప్రాంతం, ప్రగతి పాఠాలను బోధిస్తూ మీ ముందుకొచ్చిన నేతలు అసలు రూపాలను గమనించండి. నయవంచకులను గుర్తించండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలిచ్చి గెలిచాక ఒక్కసారైనా మీ ముఖం చూడని నాయకులను గెలిపించాలా..? మన సమస్యల్ని, ప్రాంత బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్ట్‌ పనులు చేసి కోట్లు సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా..? ఏదైనా పనిపడి నేతల వద్దకు పోతే ఇంటి గేటవతల నిలబెట్టే లీడర్లను గెలిపించాలా..? ఇకనైనా కళ్లు తెరవండి.. చివరగా ఒక్కమాట మంచి అభ్యర్థిని గుర్తించండి.. బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. అంతరాత్మ సాక్షిగా ఓటు వేయండి. 
ఇక లేవండి.. ఓటేసే టైమొచ్చింది.. పోలింగ్‌ కేంద్రం బాట పట్టండి. 
ఇట్లు 
మీ అందరి సంక్షేమాన్ని కోరే.. మీ పల్లె తల్లి 
 


 

మరిన్ని వార్తలు