క్యాట్ ఫినిష్

25 Dec, 2015 00:43 IST|Sakshi
క్యాట్ ఫినిష్

అక్రమంగా క్యాట్ ఫిఫ్ సాగు
చెలరేగిపోతున్న తెలుగు తమ్ముళ్లు
కోట్లు సంపాదిస్తున్న వేస్ట్‌ఫుడ్ మాఫియా
వైద్య శాఖ మంత్రి ఇలాకాలో  {పజారోగ్యానికి ముప్పు

 
 కొల్లేరు కేంద్రంగా నిషిద్ధ క్యాట్‌ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. ఈ చేపల్ని తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం క్యాట్‌ఫిష్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. కొల్లేరు
 అభయారణ్యంలో మడుగులు ఏర్పాటుచేసి మరీ ఈ సాగు చేపట్టారు. వీటికి కోళ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలను  మేతగా
 వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలా వ్యర్థాల రవాణా ద్వారా ప్రతి నెలా రూ.150 కోట్ల టర్నోవర్ సాగిస్తున్నారు. సాక్షాత్తూ వైద్య,
 ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం.
 
 కైకలూరు : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు అధికార పార్టీ నేతల అండతో జోరుగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా హద్దుల్లోని కొల్లేరు ప్రాంతం నుంచి రోజూ 10 టన్నుల క్యాట్‌ఫిష్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.30కి కొనుగోలు చేసి అక్కడి మార్కెట్‌లో రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏటి చేపలుగా చెప్పి వీటిని ఇతర రాష్ట్రాల్లోని మత్స్యప్రియులకు అంటగడుతున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటం..
కేంద్ర ప్రభుత్వం 2007లో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం విధించింది. ఆఫ్రికాకు చెందిన ఈ చేప కోడిఈకలు, పేగులు వంటి వ్యర్థాలను మేతగా తింటుంది. ఇవికాక నిల్వఉన్న అన్నం, కూరల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. వీటన్నింటినీ నిత్యం రవాణా చేసే మాఫియా జిల్లాతోపాటు సమీప పశ్చిమగోదావరి  జిల్లాలో ఉంది. ఈ వేస్ట్‌ఫుడ్ మాఫియా నెలకు రూ.150 కోట్ల ఆదాయం పొందుతోంది.
 మనోడే వదిలేయండి..
 కొల్లేరు అభయారణ్యంలో జీవో నంబరు 120 ప్రకారం చేపల సాగు నిషేధం. అలాంటిది ఏకంగా ప్రాణహాని చేసే క్యాష్‌ఫిష్‌నే సాగు చేస్తున్నారు.   కొవ్వాడలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక, నుచ్చిమల్లి, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామాల్లో రహస్యంగా క్యాట్‌ఫిష్ సాగు జరుగుతోంది. కొల్లేరులో మడుగులు ఏర్పాటు చేసి వీటికి మేతలు వేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. మనోడే వదిలేయండని సిఫారసు చేయడంతో అధికారులు రెండు, మూడు కేసులకే పరిమితమవుతున్నారు.
 
క్యాట్‌ఫిష్ సాగు చట్ట విరుద్ధం
కేంద్ర ప్రభుత్వం క్యాట్‌ఫిష్ సాగును నిషేధించింది. పోలీసు, రెవె న్యూ, మత్స్యశాఖ అధికారుల బృందం సాగుదారులపై కేసులు నమోదు చేసే విధంగా చట్టం రూపొందించారు. ఆక్వాసాగులో మేతల ధరలు పెరగడంతో కొందరు క్యాట్‌ఫిష్ సాగు వైపు చూస్తున్నారు. క్యాట్‌ఫిష్ చేపల ఉత్పత్తులు పెరిగితే ఆ ప్రభావం పెంపకం చేపలపై పడుతుంది.  
 -పి.సురేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం.  
 
 

మరిన్ని వార్తలు