ఫంగస్ ముసుగులో క్యాట్‌ఫిష్ !

18 Dec, 2013 01:16 IST|Sakshi

= తీరగ్రామాల్లో భారీ చెరువులు
 = దొడ్డిదారిలో సాగు
 =  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

 
కోడూరు, న్యూస్‌లైన్ :  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పర్యావరణానికి  పెను ముప్పు కలిగించడమే కాకుండా ప్రజారోగ్యాన్ని హరించివేసే క్యాట్‌ఫిష్‌ను  సాగుచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కోడూరు మండల పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో ఈ సాగు యథేచ్ఛగా సాగుతోంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విరివిగా వినియోగించే ఫంగస్ చేప ముసుగులో క్యాట్‌ఫిష్‌ను జోరుగా సాగు చేస్తున్నారు.  

ఈ రెండు జాతుల చేపలు ఒకే రకమైన రూపాన్ని కలిగి ఉండి ఆక్వా రంగంపై అంతగా అవగాహన లేని సామాన్య ప్రజానీకం గుర్తించలేనంతగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. సముద్రతీర ప్రాంతమైన మందపాకల-చింతకోళ్ళ గ్రామాల మధ్య మాగాణి పొలాల్లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా క్యాట్‌ఫిష్ సాగు చేసి... అధికారులు కళ్లుకప్పి అక్రమంగా తర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు సుమారు 25 నుంచి 30 ఎకరాల్లో భారీ చెరువులను తవ్వి గుట్టుచప్పుడు కాకుండా క్యాట్‌ఫిష్ సాగు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒక్కరోజే సంబంధిత రైతు సుమారు నాలుగు నుంచి ఐదు భారీ వాహనాల ద్వారా క్యాట్‌ఫిష్‌ను ఉత్తరప్రదేశ్‌కు తరలించారని సమాచారం.  

చెరువుల సాగుకు అనుమతులు లభించిన రైతులూ చేపల సాగు పేరుతో క్యాట్‌ఫిష్‌ను సాగుచే స్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్యాట్‌ఫిష్ సాగును అరికట్టి,దొడ్డి దారిలో చేస్తున్న రైతులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు  కోరుతున్నారు.
 
సాగు విషయం తెలియదు : మత్స్యశాఖ ఏడీఏ చెన్ను నాగబాబు

 ఈ విషయమై  మత్స్యశాఖ అవనిగడ్డ ఏడీవో చెన్ను నాగబాబును వివరణ కోరగా తీరప్రాంతాల్లో క్యాట్‌ఫిష్ సాగుచేస్తున్న సంగతి తమకు దృష్టికి రాలేదన్నారు. క్యాట్‌ఫిష్ సాగుపై ప్రభుత్వ  నిషేధం ఉందని,  నిబంధనలు అతిక్రమించి సాగుచేసిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాగు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు