పశు అక్రమ రవాణాకు బ్రేక్‌ పడేనా?

24 Dec, 2018 07:22 IST|Sakshi
పార్వతీపురం మార్కెట్‌ యార్డులో తరలించడానికి సిద్ధంగాఉన్న పశువుల మందలు (ఫైల్‌)

పశు అక్రమ రవాణాను నిరోధించాలంటూ సబ్‌కలెక్టర్‌ ఆదేశం

పోలీస్, రెవెన్యూ అధికారులకు సవాల్‌గా మారిన వైనం

పార్వతీపురంలో పశు అక్రమ రవాణా జోరు

విజయనగరం , పార్వతీపురం: పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటూ సబ్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ ఆదేశాలు అమలవుతాయా లేదా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరందుకుంది. వాస్తవంగా జిల్లాలోని సంతల నుంచి పశు అక్రమరవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. మూగజీవాలను చిన్నచిన్న వాహనాల్లో కుక్కి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వీటిని అడ్డుకోవాలంటూ సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలు జారీచేయడం పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది.

పార్వతీపురంలో వ్యాపారం జోరు...
పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌గా పార్వతీపురం మారింది. సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా పార్వతీపురానికి దగ్గరగా ఉండడంతో పశువుల మందలు తండోప తండోలుగా పార్వతీపురానికి వ్యాపారులు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచే బొలేరో వాహనాల్లో పశువులను ఎక్కించి తరలిస్తున్నారు. ప్రతీ వారం సుమారు 100 వరకు బొలేరో వాహనాల్లో పశువులను ఎక్కించి జిల్లాను దాటిస్తున్నారు. ఇదంతా పార్వతీపురం మార్కెట్‌ యార్డు సాక్షిగా సాగుతుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, అలమండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పార్వతీపురం మార్కెట్‌యార్డులో పశువుల మందలను టోకున(మగత బేరం) కొనుగోలు చేసి బొలెరో వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రతీ గురువారం ఇక్కడ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ప్రతీ గురువారం 800 నుంచి 1000  వరకు పశువులను కొనుగోలు చేసి కొన్నింటిని బొలేరో వాహనాల్లో మరికొన్నింటిని కాలినడకన జిల్లా దాటిస్తున్నారు. ప్రతీ వారం పార్వతీపురం మార్కెట్‌ యార్డు కేంద్రంగా సుమారు రూ.50 లక్షల వరకు పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం.

అధికారుల చర్యలు శూన్యం...
పార్వతీపురం కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జరుగుతున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రతీ బుధ, గురువారాల్లో బొలేరో వాహనాల్లో పశువులను మూగజీవాల చట్టానికి విరుద్ధంగా ఇరికించి తరలిస్తున్నా ఏ ఒక్క అధికారి వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. పైగా రైతులు అవసరాలకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని ఉచిత సలహాలు ఇస్తున్నారంటే దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటోందో ఊహిస్తే ఇట్టే అర్ధమౌతోంది. వాస్తవంగా పశువులను కొనుగోలు చేసే సమయంలో పశు వైద్యాధికారి నుంచి, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ నుంచి, లేదంటే రవాణా శాఖ అధికారి నుంచి పశువులను ఏ అవసరం మేరకు కొనుగోలు చేశారో రసీదు తీసుకోవాలి. అయితే, వీరి వద్ద ఏ ఒక్క ధ్రువపత్రం లేకపోయినా దర్జాగా పవువులను బొలేరో వాహనాల్లో జిల్లాను దాటిస్తున్నారు.

సబ్‌ కలక్టర్‌ ఆదేశాలు అమలు చేస్తారా?
పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ అక్రమ పశురవాణాకు కళ్లెం వేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శుక్రవారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పశు అక్రమ రవాణాను అరికట్టాలని, మూగ జీవాల చట్టాన్ని పరిరక్షించాలని, అక్రమ కబేళాలలను మూసి వేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇంత వరకు ఏ ఒక్క అధికారి పశు అక్రమ రవాణాపై, అక్రమ కబేళాలపై దృష్టి సారించలేదు. సబ్‌కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తారా? లేక సరాసరి ఇది మామేలే అని తేలికగా తీసుకుని వ్యాపారులకు సహకరిస్తారో వేచి చూడాలి.

హింసిస్తూ...
మూగజీవాలను ఒడిశా నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి విజయనగరం జిల్లాకు దాటిస్తున్నారు. అక్కడి నుంచి  అరకు, పాడేరు వరకు కాలి నడకన తరలించి అక్కడి నుంచి రహస్య మార్గంలో హైదరాబాద్, కేరళ  ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ పశువుల మందలను కాలినడకన వందల కిలోమీటర్లు నడిపిస్తున్న సమయంలో కర్రలతో కొట్టడం, సూదులతో గుచ్చి హింసిస్తున్నారు. కొన్ని పశుల కాళ్ల నుంచి రక్తం సైతం కారుతోంది. ఈ హింస ఏ ఒక్క అధికారికి కనిపించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు