మైనింగ్‌ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ

15 Aug, 2018 05:31 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, గుంటూరు: పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మైనింగ్‌ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్‌ ఏడీ జగన్నాధరావులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని సీబీసీఐడీ విచారిస్తుందా?
గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్‌ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోంది. సీబీఐ విచారణకు సర్కారు జంకుతోంది. మైనింగ్‌ మాఫియాపై హైకోర్టు కన్నెర్ర చేయడం, ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తోంది. మైనింగ్‌ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, సూపర్‌వైజర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తోంది. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్‌ అధికారులకు సోమవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్‌ డీడీ, ఏడీపై సస్పెన్షన్‌ వేటు వేసి అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే పెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో కొనసాగుతున్నవారిని సీబీసీఐడీ విచారించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


లెక్కలు దాచిపెట్టి కార్మికులపై చర్యలు
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం బలి పశువుల కోసం రంగంలోకి దిగింది. మైనింగ్‌ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. 

సీబీఐ విచారణకు ఆదేశించాలి
రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది? ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్‌ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. 
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్‌ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి.
– కాసు మహేష్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు