బాపట్లలో సీబీఐ ప్రకంపనలు

11 Jul, 2018 13:32 IST|Sakshi

నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా

253మందిపై కేసు

విశాఖపట్నం, హైదరాబాద్‌లోకేసుల నమోదు

బిక్కుబిక్కుమంటున్న బినామీలు

బాపట్ల: నకిలీ పత్రాలు, బినామీ పేర్లతో ఐడీబీఐ బ్యాంకుకు టోకరా పెట్టిన వ్యవహారం బాపట్ల నియోజకవర్గాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు బాపట్లకు చెందినవారే. ఈ కేసులో బినామీలుగా ఉన్న 253 మంది కూడా బాపట్లకు చెందిన వారు కావడం, సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2010 సంవత్సరంలో జరిగిన ఈ స్కాములో సీబీఐ అధికారులు విశాఖపట్నంలో మూడు కేసులు, హైదరాబాద్‌ ఒక కేసులో ప్రధాన నిందితులతోపాటు మరో 253 మందిని నిందితులుగా తేల్చారు. వారి నుంచి అసలు, వడ్డీ కలిపి రూ.141.12 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాన నిందితులుగండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు, ఐడీబీఐ బ్యాంకు అప్పటి మేనేజర్‌ హరీష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో మరో ఎఫ్‌ఐఆర్‌
గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు ఐడీబీఐ బ్యాంకులో నకిలీ పత్రాలు, బినామీ పేర్లుతో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవటంతో సంస్థ జనరల్‌ మేనేజర్‌ ధనుంజయ్‌లాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 22వ తేదీన హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. రూ.33.81కోట్ల అసలు, వడ్డీతో కలిపి రూ.93.73కోట్లు బ్యాంకుకు చెల్లించాలని 142 మందిపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలో గతేడాది జనవరి 23వ తేదీన రూ.10.42 కోట్లు అసలు, వడ్డీతో కలిపి రూ.20 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన 45 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది జనవరి 28వ తేదీన రెండో ఎఫ్‌ఐఆర్‌లో అసలు, వడ్డీ కలిపి రూ.17.09 కోట్లు చెల్లించాలని 35 మందిపై,  అసలు వడ్డీ కలిపి రూ.10.14కోట్లు చెల్లిం చాలని 25 మందిపై మూడో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ప్రధాన నిందితులతోపాటు బ్యాం కులో ఆస్తులకు సంబంధించిన అంచనాలు వేసినవారిలో మరో ఆరుగురు సహా 253 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితులను అరెస్టు కావడంతో ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కువ మంది చిన్న, సన్నకారురైతులు, వ్యవసాయకూలీలే. పనికి వెళ్లకపోతే పూటగడవని కూలీలను కూడా బినామీలుగా చూపటం తీవ్ర చర్చానీయాంశమైంది.

మరిన్ని వార్తలు