టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు

12 May, 2017 15:21 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్‌ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆదాయపన్ను శాఖ అధికారులు మే 3వ తేదీన వాకాటి ఇళ్లపై దాడులు చేసి, ఆయన విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేశారు. అప్పట్లో నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

తాజాగా శుక్రవారం తెల్లవారుజామునే నెల్లూరు చేరుకుని వేదాయపాళెంలో ఉన్న ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి నెల్లూరులో ఉన్నది కేవలం అతిథిగృహం మాత్రమే. అందులో పది బెడ్రూంలు ఉన్నాయి. సీబీఐ అధికారులు అన్ని గదుల్లోకీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఏం గమనించామన్న విషయాన్ని మాత్రం వాళ్లు వెల్లడించడం లేదు. వాకాటి స్వగ్రామానికి కూడా సీబీఐ మరో బృందం చేరుకున్నట్లు తెలిసింది. స్టేట్‌ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబీ తదితర బ్యాంకులకు వాకాటి భారీగా బకాయిలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు