ఉల్లి మార్కెట్‌పై సీబీఐ విచారణ

13 Sep, 2014 13:09 IST|Sakshi
ఉల్లి మార్కెట్‌పై సీబీఐ విచారణ

ఉల్లి నిల్వలు, అమ్మకాలు, మార్కెట్ పరిస్థితులపై ఆరా
తాడేపల్లిగూడెంలో సీబీఐ బృందం మకాం
ఏలూరు మార్కెట్‌లోనూ వివరాల సేకరణ

తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల మార్కెట్‌పై కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) దృష్టి సారించింది. ఉల్లిపాయలేంటి.. సీబీఐ ఏంటని ఆశ్చర్యపోకండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉల్లి పంట, మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేయూల్సిందిగా సీబీఐకి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో సీబీఐ అధికారుల బృందం ఉల్లికి ప్రధాన మార్కెట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మకాం వేసింది.
 
ఇటీవల కాలంలో ఉల్లి ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయాయి. దీనికి మహారాష్ట్రలో అధిక వర్షాలు ఒక కారణం కాగా, కృత్రిమ కొరత కూడా ధరలను ఆకాశం నుంచి దిగనివ్వటంలేదు. అందుకే కేంద్రప్రభుత్వం ఉల్లి పండే ప్రాంతాలతో పాటు, వాటిని విక్రయించే మార్కెట్ల పరిస్థితులపైనా సమాచారం సేకరించాలని సీబీఐని ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడి మార్కెట్ స్థితిగతులపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇవే అంశాలపై ఇటీవల ఏలూరులోనూ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తాడేపల్లిగూడెం, ఏలూరులోని ఉల్లి వ్యాపారుల్లో కలకలం రేపుతోంది.

కర్నూలు ఉల్లిపాయలకు సంప్రదాయ మార్కెట్‌గా తాడేపల్లిగూడెంకు పేరుంది. ఈ ఉల్లికి కర్నూలు పుట్టిల్లైతే, తాడేపల్లిగూడెం మెట్టినిల్లుగా మారింది. చాలాకాలంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉల్లి బంధం పెనవేసుకుపోయింది. ఇటీవల ఈ బంధం బలంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అవాక్కయ్యారు. దీంతో ఉల్లి వ్యవహా రంపై రాష్ట్రం కూడా నిఘా పెంచింది. ఉల్లి రవాణా విధానాలలో మార్పులు సైతం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంట, డిమాండ్, మార్కెట్లకు వచ్చే సరుకు పరిస్థితులు, నిల్వలు, కృత్రిమ కొరత వంటి అంశాలతోపాటు ఎగుమతులకు సంబంధించిన అంశాలపైనా సీబీఐ ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు