కఠిన పరీక్ష

13 Mar, 2018 10:33 IST|Sakshi
పరీక్ష రాస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

ఇన్విజిలేటర్లకు అగ్నిపరీక్ష 

టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కాపీ కొట్టిస్తే ఇన్విజిలేటర్‌పై చర్యలు

చట్టం 25 ప్రయోగానికి సన్నాహాలు

సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

నేలబారు పరీక్షలు లేకుండా జాగ్రత్తలు

కడప ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్‌కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు.

పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్‌ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్‌ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది.

కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్‌ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్‌లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్‌తోపాటు డిపార్టుమెంట్‌ ఆఫీసర్, చీఫ్‌ సూపరిండెంట్‌పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది.

సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు
జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్‌), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్‌ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 

ఆందోళనలో ఇన్విజిరేటర్లు
పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి.

ఈ ఏడాది 35,737 మంది
ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

పకడ్బందీగా నిర్వహిస్తాం
ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ

మరిన్ని వార్తలు