తస్మాత్‌.. జాగ్రత్త!

12 Feb, 2019 08:15 IST|Sakshi
నిఘా కెమెరాలు అమర్చేందుకు స్తంభాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు

గీత దాటారో.. జరిమానా

95 సీసీ కెమెరాలు సిద్ధం చేస్తున్న పోలీసులు

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాల సహాయంతో జరిమానాలు విధించేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో పలు కూడళ్లలో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తూ అత్యాధునికి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ కెమెరాలు ఏర్పాటు తరువాత ట్రాఫిక్‌ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా క్షణాల్లో సీసీ కెమెరాల్లో నమోదై జరిమానా కట్టేందుకు ఈ చలానా అందుకోవాల్సిందే. రాష్ట్ర  ప్రభుత్వం హైస్పీడ్‌ సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాలకు 325 సీసీ కెమెరాలు మంజూరు చేసింది.

తొలి విడతగా నగరంలో ప్రధాన కూడళ్లలో 95 కెమెరాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టింది పోలీస్‌శాఖ. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల్లో కెమెరా అమర్చేందుకు అవసరమైన స్తంభాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క స్తంభానికి నాలుగు కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. ఈ నిఘా వ్యవస్థ వల్ల పాత నేరస్తులతో పాటు చోరీకి గురైన వాహనాలను గుర్తించవచ్చని, అలాగే నిబంధనలు అతిక్రమించిన వారితో పాటు, ఆ వాహన చోదకుని ఫొటో, వాహనం నంబర్‌ ప్లేట్‌ ఫొటో ఇలా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు అర్బన్‌ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇకపై వాహన చోదకులు జాగ్రత్తగా వ్యవహరించి వాహనాల అధిక స్పీడు, రాంగ్‌రూట్, లైన్‌ దాటడం వంటి తప్పిదాలు చేయకుండా వాహనాలు నడపాల్సి ఉంటుందని అడిషనల్‌ ఎస్పీ రమణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు