వాటర్‌ ప్లాంట్‌లో విషద్రావణం

26 Mar, 2020 12:49 IST|Sakshi
సీసీ ఫుటేజీలో రికార్డ్‌ అయిన విషద్రావణం కలుపుతున్న దృశ్యాలు

సీసీ కెమెరా ఫుటేజీలో బట్టబయలు  

పోలీసు అదుపులో నిందితులు

నెల్లూరు, కోవూరు: ఎదుట ఉన్న వాటర్‌ ప్లాంట్‌తో తన వ్యాపారం సక్రమంగా జరగడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా మినరల్‌ వాటర్‌ ప్లాంటులో విషద్రావణం కలిపేశాడు. అయితే ప్లాంటు నిర్వాహడు ఆ వాసనను పసిగట్టి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కోవూరులోని పెళ్లకూరు కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పెళ్లకూరు కాలనీ సమీపంలో కొంతకాలంగా కోదండరామయ్య అనే వ్యక్తి సాయిబాబ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిద్ధం చేసిన తాగునీటిని అక్కడే క్యాన్లు నింపడంతో పాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ వాటర్‌ ప్లాంట్‌ సమీపంలో సుజల వాటర్‌ప్లాంట్‌ను శ్రావణ్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు.

కాగా సాయిబాబ వాటర్‌ ప్లాంట్‌ కారణంగా తన ప్లాంటు సక్రమంగా జరగడం లేదని శ్రావణ్‌ కోదండరామయ్యపై అక్కసు పెంచుకొన్నాడు. సమయం కోసం వేచిచూస్తున్న అతను మంగళవారం అర్ధరాత్రి విషద్రావణం(పెనాయిల్,యాసిడ్‌ మిశ్రమం)ను వాటర్‌ ట్యాంక్‌ పైపుల ద్వారా కలిపేశాడు. బుధవారం కోదండరామయ్య కుమారుడు ప్లాంటు వద్దకు వచ్చి శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వాసన రావడంతో అనుమానం వచ్చి ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి వేళలో బైక్‌పై వచ్చిన శ్రావణ విషద్రావణాన్ని పైపుల్లో కలపడం స్పష్టంగా కనిపించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా గతంలో కూడా ఇదేవిధంగా రెండుసార్లు శ్రావణ్‌ తమ ప్లాంటుకు చెందిన విద్యుత్‌ వైర్లను కట్‌ చేశాడని బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్‌ కృష్ణారెడ్డి సీసీ ఫూటేజీలను పరిశీలించి నిందితులపై కేసు నమెదు చేశారు. అలాగే సుజల వాటర్‌ప్లాంట్‌ను సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు