కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద సందడి

19 Aug, 2013 02:16 IST|Sakshi

గజ్వేల్/జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్: జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నేతల హడావిడి కన్పించింది. పార్టీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య నేతల వెంట వచ్చిన అనుచరులు, గన్‌మెన్‌లతో అక్కడ సందడి నెలకొంది. ఈ సమావేశంలో  టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపీలు మంద జగన్నాథం, వివేక్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, విద్యాసాగర్, జూపల్లి కృష్ణారావు, గంప గోవర్ధన్, డాక్టర్ టి.రాజయ్య, హరీశ్వర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, జోగు రామన్న, అరవిందరెడ్డి, వినయ్‌భాస్కర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, భిక్షపతి, కేటీఆర్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌అలీ, మాజీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పద్మారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ, రాజేందర్, నరేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు రమణాచారి, శ్రావణ్, రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
  టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్, మరో ఎమ్మెల్యే వేణుగోపాలచారి సమావేశానికి హాజరుకాలేదు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సమావేశానికి ఆలస్యంగా హాజరుకాగా, పరకాల ఎమ్మెల్యే భిక్షపతి చివరి దశలో ఫామ్‌హౌస్‌లోకి వెళ్లారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారుల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశాన్ని కవర్ చేయడానికి ఉదయం 11 నుంచి వివిధ ఛానళ్లకు చెందిన ఓబీ వ్యాన్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాత్రి 8.30గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. సమావేశం పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్ నేతలు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, వినోద్ తదితరులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించారు.
 
 పార్టీ విలీనంపై చర్చ..
  కాంగ్రెస్‌లో పార్టీ విలీనం అంశం చర్చకు వచ్చిందని, అయితే చాలామంది ఇప్పుడే వద్దంటూ వారించినట్టు తెలియవచ్చింది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా విలీనంపై తొందరపడితే మునిగిపోతామని కొందరు, తెలంగాణ వచ్చినా టీఆర్‌ఎస్‌ను ప్రత్యేక పార్టీగానే కొనసాగించాలని మరికొందరు సలహా ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు