స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరడం సబబే

4 Nov, 2018 05:20 IST|Sakshi

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై ప్రముఖుల స్పందన

     చేసిందెవరో పూర్తిగా తెలిసిపోయినట్లు సీఎం ఎలా చెబుతారు?

     అందుకే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటున్నారు

     బాధితుని హోదా, కేసు తీవ్రత దృష్ట్యా ఇది న్యాయమైన డిమాండే 

సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును ప్రభుత్వ అధీనంలో లేని సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కోరడంలో తప్పు లేదని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నప్పుడు ఈ డిమాండ్‌ సహేతుకమేనంటున్నారు. వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలోని క్యాంటిన్‌లో పనిచేసే జె.శ్రీనివాసరావు కోడి పందేలకు వాడే కత్తితో దాడికి తెగబడిన తర్వాత ఈ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. హత్యాయత్నం జరిగిన వెంటనే పూర్వాపరాలను విచారించాల్సిన పోలీసు శాఖ.. అవేవీ పట్టించుకోకపోవడం, సంఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పోలీసు విభాగానికి అధిపతిగా ఉన్న డీజీపీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం, అంతలోనే లేఖలు, ఫ్లెక్సీలు బయటకు రావడం, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మానవత్వం మరచి వ్యాఖ్యానాలు, విమర్శలకు దిగడం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్థాయిని దిగజార్చుకునేలా ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేయడం, ఇదేదో సంచలనం కోసం జరిగిన ఘటనగా చిత్రీకరించడం, రాష్ట్ర అధిపతిగా ఉన్న గవర్నర్‌ ఈ సంఘటనపై ఆరా తీయడాన్ని తప్పుబట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వతంత్ర దర్యాప్తును కోరింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యక్తులే ఇలా దిగజారి మాట్లాడిన తరుణంలో తమకు పోలీసు శాఖ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)పై విశ్వాసం లేదని ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు హైకోర్టులో వ్యాజ్యం కూడా వేసింది. దీన్ని తప్పుపడుతూ అధికార టీడీపీ నేతలు ప్రధాన ప్రతిపక్షంపై విమర్శల దాడికి పూనుకున్నారు. ప్రస్తుత పరిణామాలు, పరస్పర విమర్శలు, ఐదు రోజుల పాటు నిందితుడిని విచారించినా హత్యాయత్నానికి పథకాన్ని రచించిన సూత్రధారులు, పాత్రధారులెవరో సిట్‌ దర్యాప్తు కనిపెట్టలేకపోయిన నేపథ్యంలో ‘సాక్షి’ పలువురు ప్రముఖులు, న్యాయవాదుల అభిప్రాయాలను కోరింది. వాళ్లు ఏమన్నారంటే..

ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండా డీజీపీ ఎలా మాట్లాడతారు? 
ఇదో అసాధారణమైన కేసు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండా డీజీపీ, ముఖ్యమంత్రి దానిపై మాట్లాడకూడదు. జగన్‌పై హత్యాయత్నం కేసులో ఈ విషయాన్ని డీజీపీ, ముఖ్యమంత్రి తుంగలో తొక్కారు. కేసును పక్కదోవ పట్టించేలా మాట్లాడారు. నిబంధనలను తోసిరాజని మాట్లాడిన డీజీపీ నియమించిన సిట్‌కు విలువేముంటుంది? సహజంగా పై అధికారి చెప్పిందే కింది అధికారి చేస్తాడు. అందువల్ల జగన్‌ డిమాండ్‌ సమంజసం, సహేతుకం. చాలా కేసుల్లో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఈ కేసులో కూడా అదే జరగవచ్చు.  
– ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు

బాధితుని హోదా, కేసు తీవ్రత దృష్ట్యా కోరవచ్చు
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న డిమాండ్‌ సమంజసమే. అయితే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం రెండు సందర్భాలలో ఉంటుంది. ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలు. రెండు.. కోర్టు మార్గదర్శకత్వాలు. సత్యం కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తే షేర్‌హోల్డర్లు కోర్టుకు వెళ్లి సీబీఐ దర్యాప్తు కోరి తెచ్చుకున్నారు. కేసు తీవ్రత, బాధితుని హోదాపై దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. జగన్‌పై హత్యాయత్నం విచారణకు పోలీసు శాఖ వేసిన సిట్‌ ఇప్పటికే పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించినట్టు చెబుతున్నారు. అంటే ఈ కేసు చాలా ప్రాధాన్యమైందని తెలుస్తోంది. దీనివెనుకున్న కుట్ర గురించి దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. పారదర్శకత కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలి. హత్యాయత్నం జరిగింది ప్రతిపక్ష నాయకుని మీద కాబట్టి కేసు తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దర్యాప్తు సంస్థలను రాష్ట్ర పోలీసులు, ముఖ్యమంత్రి తప్పుదోవపట్టించే అవకాశం ఉందని వైఎస్‌ జగన్‌ అనుమానిస్తున్నందున స్వతంత్ర దర్యాప్తు కోరడం సమంజసమే.     
    – ఎన్‌.రామచంద్రరావు, ఇండియన్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు

అది న్యాయమైన డిమాండే 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న స్వతంత్ర దర్యాప్తు డిమాండ్‌ చాలా న్యాయమైంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత గంటలోపే రాష్ట్ర పోలీసు అధిపతి, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ బయటకు వచ్చి చెప్పిందేమిటి? హత్యాయత్నం చేసిన వ్యక్తి.. జగన్‌ మనిషని, ఆయన అభిమానని, తన నాయకుని సానుభూతి కోసమే ఈ దాడి చేశాడనే నిర్ణయానికి వచ్చేశారు. ఎప్పుడైతే విచారణకు ముందే ఇటువంటి నిర్ణయానికి వచ్చారో ఇక విచారణ ఎలా జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ మొదలు పెట్టక మునుపే డీజీపీ తన నిర్ణయాన్ని చెప్పేశాడు. నిందితుడు వైఎస్సార్‌సీపీ అభిమానని, అభిమానితోనే వైఎస్‌ జగన్‌ దాడి చేయించుకున్నాడని డీజీపీ నిర్ణయానికి వచ్చిన తర్వాత బాధితునికి ఏ రకమైన విశ్వాసం కలుగుతుంది? ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఈ హత్యాయత్నాన్ని ఓవైపు చులకనగా మాట్లాడుతుంటే మరోవైపు దర్యాప్తు చేయాల్సిన డీజీపీ ఇలా మాట్లాడిన తర్వాత ఇక విచారణ అనేది తూతూ మంత్రంగానే ఉంటుంది. విచారణలోనూ అదే చెబుతారనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ఈ అనుమానం రావడానికి డీజీపీ అత్యుత్సాహం, అది కూడా టీడీపీ భాషలో మాట్లాడడం కారణం. చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి ఇదే చెప్పిన తర్వాత పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని గానీ, నిజానిజాలు నిగ్గుతేల్చుతారని గానీ వైఎస్సార్‌ సీపీ నమ్మే అవకాశమే లేదు. అందువల్ల వాళ్లు కోర్టుకు వెళ్లి నిష్పాక్షికమైన థర్డ్‌ పార్టీ దర్యాప్తు కోరడంలో న్యాయముంది.
– ప్రొఫెసర్‌ కె.నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ

ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఇవ్వొచ్చు
వైఎస్సార్‌సీపీ డిమాండ్‌లో తప్పులేదు. జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు సరిగా లేదని భావించినప్పుడు స్వతంత్ర సంస్థతో విచారణ కోరడం సమంజసమే. గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పుడు అదేపని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేసి తన నిష్పాక్షికతను నిరూపించుకోవచ్చు. తాను పక్షపాతంగా లేనని నిరూపించుకునేందుకైనా ఆ పని చేయవచ్చు. అలా చేయడం వల్ల సమాజంలో ఆయన హోదా పెరుగుతుందే తప్ప తరగదు. ఢిల్లీ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం ఏర్పాటైన స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇది ఇటువంటి నేరాలను విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవచ్చు. ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ అడిగినప్పుడు స్వతంత్ర దర్యాప్తును అంగీకరించవచ్చు. 
– వీరారెడ్డి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది 

మరిన్ని వార్తలు