సెల్‌టవర్ ఏర్పాటును అడ్డుకోవాలి

3 Jun, 2014 01:05 IST|Sakshi
సెల్‌టవర్ ఏర్పాటును అడ్డుకోవాలి

 సాక్షి, కాకినాడ:ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరి రిసార్ట్స్ సమీపంలో జనావాసాల మధ్య ఇప్పటికే పంచాయతీ అనుమతి లేకుండా ఒక సెల్‌టవర్ నిర్మించారని, ఇపుడు మరో టవర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు హాజరైన అన్నవరం గ్రామస్తులు కలెక్టర్ నీతూప్రసాద్‌కు ఈ సెల్ టవర్ ఏర్పాటును అడ్డుకోవాలని అర్జీ అందజేశారు. జనావాసాల మధ్య లాడ్జి నిర్వహిస్తున్న వ్యక్తి తన భవనం పై ఈ సెల్ టవర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారని వారు ఆరోపించారు. లాడ్జి నిర్వహణకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు.
 
 ‘నిర్భయ’ కేసు నమోదు చేయాలి
 మైనర్‌బాలికపై లైంగిక వేధింపులను అడ్డుకున్న ఆమె అన్నను కొందరు చంపేశారని, దీనిపై నిర్భయ చట్టం కింద కాకుండా ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. గత ఏప్రిల్ 24న ఏలేశ్వరం మందుల కాలనీలో ఈ హత్య జరిగింది. ఎనిమిది మంది నిందితులు ఉండగా, ముగ్గురి పైనే కేసు నమోదు చేశారని బాధితులన్నారు. ఎస్సైని సస్పెండ్ చేసి, ఐపీసీ 354 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని బాధితుల పక్షాన దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి ఎ. సూర్యనారాయణ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కలెక్టర్ నీతూప్రసాద్ జిల్లా ఎస్పీకి పంపించారు.
 
 గ్రీవెన్స్‌కు 200 అర్జీలు
 గ్రీవెన్స్ సెల్‌కు దాదాపు 200 అర్జీలు అందాయి. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి రుణాలు, ఉద్యోగాల కల్పన, కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు కోరుతూ ఆయా అర్జీలు అందాయి.
 
 డయల్ యువర్ కలెక్టర్‌కు
 30 ఫిర్యాదులు
 ఎన్నికల అనంతరం తొలిసారి నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుంచి 30 మంది ఫోన్‌లో ఫిర్యాదులు చేశారు. సఖినేటిపల్లి జెడ్‌పీటీసీ మెంబర్ సఖినేటిపల్లి, అంతర్వేది తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిపై ఫిర్యాదు చేశారు. ఆలమూరు మండలం పినపళ్ల నుంచి గృహరుణం కోసం, మండపేట మండలం కేశవరం నుంచి రేషన్ కార్డు కోసం, బిక్కవోలు మండలం ఊలపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు కోరుతూ ఫోన్లు చేశారు. డయల్ యువర్ కలెక్టర్‌లో వచ్చిన వినతులు, ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. త్వరలో బీసీ,ఎస్సీ కార్పొరేషన్‌లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేపడతామని పేర్కొన్నారు.
 

 

>
మరిన్ని వార్తలు