సెల్ టవర్లపై విజి‘లెన్స్’

11 Jul, 2014 00:43 IST|Sakshi
  •       పన్నుల ఎగవేతపై ప్రభుత్వం దృష్టి
  •      ఎగ్గొడుతున్న సంస్థల వివరాల సేకరణ
  •      పనిలో నిమగ్నమైన కార్యదర్శులు
  • నక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతూ స్థానిక సంస్థలకు బకాయిలను ఎగ్గొడుతున్న సెల్ టవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను రంగంలోకి దించింది.

    ఈ చర్యల్లో భాగంగా జిల్లాలో ఏ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఎన్ని సెల్ టవర్లున్నాయి, వాటి ఏర్పాటులో ఆపరేటర్లు నిబంధనలు పాటించారా, లేదా, ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలకు లెసైన్స్ ఫీజు చెల్లించారా లేదా, సెల్‌టవర్ ఏర్పాటులో అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా తదితర వివరాలను విజిలెన్స్, అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
         
    వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని సెల్ టవర్ల నిర్మాణాల వివరాల సేకరణలో నిమగ్నమయ్యా రు. జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో 311 సెల్‌టవర్లు ఉండగా గ్రామీణ ప్రాంతంలో 161, పట్టణ ప్రాంతంలో 150 ఉన్నాయి. మరో 52 టవర్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. వివిధ ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల ఆధ్వర్యంలో మరో 2000కు పైగా సెల్‌టవర్లున్నాయి.

    వీటి ఏర్పాటుకు మార్గదర్శకాలున్నాయి. - భూ ఆధారిత, రూఫ్‌టాఫ్ (ఎత్తయిన భవనాలపై) సెల్ టవర్లను ఏర్పాటు చేయదలచుకుంటే ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి, అగ్నిమాపకశాఖ, చుట్టుపక్కల భవనాల యజమానులనుంచి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలను తీసుకోవాలి. రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే పక్షంలో సమీప నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి.
         
    భూ ఆధారిత సెల్‌టవర్ ఏర్పాటు చేస్తే రైతు నుంచి ఒప్పందం తీసుకుని పంచాయతీకి దరఖాస్తు చేయాలి. లెసైన్స్ ఫీజు కింద రూ.15000 చెల్లించాలి. ఏటా రూ.వెయ్యి లెసైన్స్ నవీకరణ ఫీజు కింద చెల్లించాలి. భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12000 చెల్లించాలి. ఇప్పటివరకు ఏర్పాటైన సెల్‌టవర్లు ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు సరికదా పంచాయతీలు, మున్సిపాలిటీలకు రుసుము చెల్లించ కుండా పన్ను ఎగవేతకు కోర్టును ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటిసెల్‌టవర్ల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు రావలసిన బకాయిల వసూలుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను రంగంలోకి దించింది.
     

>
మరిన్ని వార్తలు