కట్టేదెట్టా..!

31 Jul, 2014 03:47 IST|Sakshi
కట్టేదెట్టా..!

ఆకాశన్నంటుతున్న నిర్మాణ సామగ్రి
సిమెంట్ ధరలు పైపైకి
మధ్యలోనే నిలిచిపోతున్న నిర్మాణాలు
ఇబ్బందుల్లో 2 లక్షల మంది కార్మికులు
నెల్లూరు (దర్గామిట్ట): సామాన్యులకు సొంతింటి కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం నిర్మాణ సామగ్రి అంతకంతకూ పెరుగుతుండటమే. చాలాచోట్ల నిర్మాణ సామగ్రి ఉన్నంత వరకు పనులు పూర్తి చేసి నిలిపి వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా నిర్మాణాలు మధ్యలో నే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్లకుపైగా విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నెల్లూరులోనే సుమారు రూ. 80 కోట్లు  నుంచి 90 కోట్లు మేర నిర్మాణ పనులు జరుగుతున్నాయనేది అంచనా. నిర్మాణరంగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన
 
నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోతుండటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 సిమెంట్ ధరలు పైపైకి ...: గతంలో 50 కిలోల సిమెంట్ బస్తా రూ. 210 నుంచి రూ.235 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 325కు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కంపెనీలన్నీ సిండికేట్ కావడం వల్లే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఒక మాదిరి ఇంటి నిర్మాణానికి 500 బస్తాలు సిమెంట్ అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక్క సిమెంట్‌కే అదనంగా రూ. 50వేలు పైనే భారం పడుతుంది.
 
అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు : ప్రస్తుతం జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించక పోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 2వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 వేలకు పెరిగింది. ఒక్కో ఇంటికి దాదాపు 40 లారీల ఇసుక అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఇసుకపైనే దాదాపు రూ. 2లక్షలపైనే భారం పడుతుంది. సామాన్య ప్రజలు పునాదులకు మట్టినే వాడుతున్నారు.
 ఇటుక ధరలకు రెక్కలు :  ఆరు నెలల క్రితం 2 వేల ఇటుకలు రూ. 6500 ఉండేవి. ప్రస్తుతం రూ. 8 వేలకు పెరిగిది. ఒక్కో ఇంటికి దాదాపు 30 వేలకు పైగా ఇటుకలు అవసరం ఉంటుందని అంచనా. క్వాలిటీ ఇటుక అయితే మరో వెయ్యి రూపాయిలు అదనంగా ఖర్చు చేయాల్సిందే.
 
కొండెక్కిన స్టీల్, ఇనుము ధరలు : ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం వైజాగ్ స్టీల్ ధర టన్ను రూ. 38 వేలు ఉంది. అది ప్రస్తుతం టన్ను రూ. 45వేలకు పైగా పెరిగింది. గతంతో పోలిస్తే టన్నుకు రూ. 8వేలు పెరిగినట్టే. ఒక్కో ఇంటికి దాదాపు నాలుగు టన్నుల ఇనుము వినియోగిస్తున్నారని అంచనా.

 పెరిగిన కంకర ధర : నిర్మాణంలో కంకర కీలకమైంది. దీని ధరలు పెరిగిపోయాయి. గతంలో యూనిట్ ధర రూ. 4 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 5 వేలకు పెరిగింది. అదే చీమకుర్తి, రాయవేలూరుల నుంచి తీసుకొచ్చిన కంకరైతే యూనిట్‌కు మరో రూ. 1500 అదనంగా చెల్లించాల్సిందే. ఒక్కో ఇంటికి 8 లారీలు కంకర అవసరం ఉంటుందని చెబుతున్నారు.
 
పెరిగిన కలప ధరలు : ఇటీవల కలప ధరలు కూడా పెరిగాయి. నాణ్యమైన కలప కొనాలంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తక్కువ కలప కొనాలన్నా అడుగు సుమారు. రూ. 1000 ఉంది. అదే నాణ్యత గల కలప కొనాలంటే అడుగు రూ. 2 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో ఇంటికి దాదాపు 50 నుంచి 60 అడుగుల కలప అవసరం. కొంత మంది కలప వినియోగం తగ్గించి ప్లాస్టిక్, ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు.

 ఇందిరమ్మ లబ్ధిదారులకు పెరిగిన కష్టాలు : నిర్మాణ సామగ్రి ధర పెరుగుదలతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒక్కో ఇంటికి రూ.75 వేలు నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదు. దీంతో పాటు గత కొన్ని నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి అమాంతంగా పెరిగి పోతున్న నిర్మాణ ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు