కంపెనీలకే కన్నం

7 Nov, 2017 05:38 IST|Sakshi

సిమెంటు స్కాం..

రవాణా సమయంలో లారీ డ్రైవర్ల చేతివాటం

అన్‌లోడ్‌ చేయకుండానే చేసినట్లు రికార్డుల సృష్టి

కదిరి సమీపంలో సగం ధరలకే సిమెంట్‌ అమ్మేస్తున్న వైనం

ఆర్థిక లావాదేవీల్లో లారీ డ్రైవర్లు, స్థానికులకు పేచీలు

కదిరి పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న సోమేష్‌నగర్‌లో సిమెంటు భలే చౌకగా లభిస్తుందని అందరూ అంటున్నారు. మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా ధర రూ.340 ఉంటే ఇక్కడ మాత్రం రూ.240 నుండి రూ.250 మాత్రమే అమ్ముతున్నారట. ఇదేమని ఆరా తీస్తే అదో పెద్ద స్కాం.. అని తెలుస్తోంది.

కదిరి: వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్ల నుంచి అనంతపురం జిల్లా కదిరి, గోరంట్ల మీదుగా బెంగుళూరుకు ప్రతి రోజూ వందలాది సిమెంట్‌ లారీలు వెళ్తుంటాయి. ఒక్కో లారీలో 500 బస్తాల దాకా సిమెంట్‌ను తరలిస్తారు. వీటిలో కొందరు లారీ డ్రైవర్లు బెంగుళూరులో సిమెంట్‌ బస్తాలున్న లారీ బరువు తూచిన తర్వాత అక్కడ అన్‌లోడ్‌ చేయకనే చేసినట్లు రికార్డుల్లో రాయించుకుంటున్నట్లు సమాచారం. తర్వాత అదే లోడ్‌ను వాపసు తీసుకొచ్చి కదిరి సమీపంలోని సోమేష్‌ నగర్‌లో అన్‌లోడ్‌ చేసి అక్కడున్న కొందరు స్థానికులకు బస్తా రూ180 నుంచి రూ.200కు అమ్ముతున్నారట. వారు ఈ సిమెంట్‌ను మార్కెట్‌ ధర కన్నా తక్కువకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని లారీల డ్రైవర్లు బస్తాల్లో కాకుండా లూజ్‌ సిమెంట్‌ ఇక్కడ అన్‌లోడ్‌ చేసి అమ్ముతున్నారు. దాన్ని మళ్లీ ఇక్కడ బస్తాల్లోకి మార్చి విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు సిమెంట్‌ అమ్మే స్థావరాలు సోమేష్‌నగర్‌లోనే 5 పాయింట్లు ఉన్నాయి. యర్రగుంట్ల – గోరంట్ల మధ్య ఇలాంటి అనధికారికంగా ఉన్న సిమెంట్‌ స్థావరాలు 18 ఉన్నాయని తెలిసింది. లారీ డ్రైవర్లే ఇలా తమను నమ్మిన సిమెంట్‌ కంపెనీ ఓనర్లను మోసగిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. ఈ వ్యాపారం ప్రతి రోజూ రూ.లక్షల్లో జరుగుతోందని, ఇదో పెద్ద స్కాం..అని కొందరు అంటున్నారు. ఇలా అనధికారికంగా సిమెంట్‌ అమ్ముతున్నందున తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సిమెంట్‌ దుకా ణాల వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రాణం మీదకు తెచ్చుకున్న ఓ లారీ డ్రైవర్‌
ఇలా లారీ డ్రైవర్లు అనధికారికంగా సిమెంట్‌ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అమ్ముతున్న విషయం కదిరి, గోరంట్ల ప్రాంతాల వాసులకు కొత్తేమీ కాదు. రెండేళ్లుగా ఈ తంతు సాగుతున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలల క్రితం గోరంట్ల సమీపంలోని ఓ తోటలో ఓ లారీ డ్రైవర్‌ అనధికారికంగా 150 బస్తాల  సిమెంట్‌ అన్‌లోడ్‌ చేసి, అందుకు సంబంధించిన డబ్బుల విషయంలో అక్కడి స్థానికుడు మద్య పేచీ వచ్చింది. స్థానికుడు సదరు లారీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి  చంపేశాడు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. కదిరి ప్రాంతంలోని సోమేష్‌ నగర్‌లో కూడా ఇప్పటికే పలు గొడవలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అనధికారికంగా సిమెంటు అమ్ముతున్న వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే హత్యలు జరిగే పరిస్థితి కూడా లేకపోలేదని వారంటున్నారు. ప్రత్యేక నిఘా పెట్టి ఈ సిమెంట్‌ స్కాంను వెలికి తీయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు