ఏపీలో ఒడిశా సి‘మంట’

23 Feb, 2018 14:08 IST|Sakshi
ట్రక్కర్లో ఒడిశా నుంచి ఆంధ్రాకు అనధికారికంగా తరలిస్తున్న రామ్‌కో సిమెంట్‌

ఒడిశానుంచి సిమెంట్‌ తెచ్చుకుంటున్న భవన నిర్మాణదారులు

అనధికారికంగా ట్రెక్కర్లు, వ్యానుల ద్వారా దిగుమతి

అక్కడి ధరలు తక్కువగా ఉండటమే కారణం

స్థానికంగా దెబ్బతింటున్న వ్యాపారాలు

ఎవరికైనా కావలసిన వస్తువు కాస్త తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోవడం సహజం. అది నిత్యవసర సరకు కావచ్చు.. మరే ఇతర సామగ్రైనా కావచ్చు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలకు అత్యంత అవసరమైన సిమెంట్‌ మనకు సమీపంలోనే ఉన్న ఒడిశాలో తక్కువ ధరకు లభిస్తుండటంతో అక్కడినుంచే కొనుగోలు చేసుకుని తెలివిగా తెచ్చేసుకోవడంతో... స్థానిక వ్యాపారులు లబోదిబో మంటున్నారు.

పార్వతీపురం: పార్వతీపురం ప్రాంతంలో వివిధ నిర్మాణాలు ఊపందుకున్నా యి. కానీ పనిలో పనిగా వాటిలో ముఖ్య మైన సిమెంట్‌ ధర మాత్రం కొండెక్కి కూచుంది. కానీ ఇక్కడకు సుమారు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలో మాత్రం కారు చౌకగా లభి స్తోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భవన నిర్మాణదారులు అక్కడినుంచే కొనుగోలు చేసుకుని తెచ్చుకోవడం మొదలుపెట్టారు. వెంకంపేట మీదుగా అలమండ, నీలావడి, నారాయణపట్నం, కొరాపుట్‌ 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండట, అలాగే కూనేరు మీదుగా రాయగడ 35 కిలోమీటర్ల దూరమే ఉండటంతో పార్వతీపురం పట్టణ ప్రజలు ఆ ప్రాంతాలనుంచి సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటున్నా రు. కాంట్రాక్టర్లయితే డీసీఎంలు, లారీ ల్లో దిగుమతి చేసుకుంటుండగా గృహనిర్మాణదారులు రోజూ తిరిగే ప్రైవేటు ట్రెక్కర్లు, వ్యాన్ల ద్వారా తెప్పించుకుంటున్నారు.

ధరలో భారీ  వ్యత్యాసం
నాగార్జున, విష్ణు కంపెనీలకు చెందిన సిమెంట్‌ బస్తా ఒక్కోటి స్థానికంగా రూ. 350 వరకు ధర పలుకుతుండగా... ఒడిశాలో అదే సిమెంట్‌బస్తా రూ. 240లకే లభిస్తోంది. ఒకే కంపెనీ రెండు ప్రాంతాలకు వేర్వేరు ధరలకు అందిస్తుండటంతో అవకాశం ఉన్నవారంతా అక్కడినుంచే తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నారు. సిమెంట్‌ కంపెనీలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఏపీలోని వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది.

నష్టపోతున్న  వ్యాపారులు...
వినియోగదారులు, కాంట్రాక్టర్లు పక్కరాష్ట్రమైన ఒడిశా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటుండడంతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారు. అదే కంపెనీకి చెందిన సిమెంట్‌ ఒడిశా ధరకు ఆంధ్రాలో అందివ్వలేకపోతున్నారు. కారణం సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి ఆంధ్రాలో డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. వినియోగదారులు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడికే వెళ్లిపోతున్నారు. అందువల్ల ఇక్కడ అమ్మకాలు పడిపోయాయి.

తూతూ మంత్రంగా దాడులు..
ఒడిశా నుంచి అనధికారికంగా సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటున్నా... వాణిజ్య పన్నులశాఖాధికారులు మాత్రం తూతూ మంత్రంగానే దాడులు కొనసాగిస్తున్నారు. జీఎస్‌టీ అమలైన తరువాత వీరు అనధికారికంగా తరలిస్తున్న సరుకులపై తనిఖీలు చేయడం భాగా తగ్గుముఖం పట్టింది. రోజూ ఒడిశా నుంచి 10 వరకు ట్రెక్కర్లు, 5 వరకు వ్యానుల్లో రామ్‌కో సిమెంట్‌ను దిగుమతి చేస్తూనే ఉన్నారు. కొ ంతమంది వే–బిల్లులు కలిగి ఉంటే ఎక్కువ మంది అవేవీ లేకుండానే తరలించేస్తున్నారు.

తీవ్రంగా నష్టపోతున్నాం
ఒడిశా నుంచి రామ్‌కో సిమెంట్‌ను వినియోగదారులు దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఆంధ్రాలో రూ.320లకు అమ్మే సిమెంట్‌ బస్తాను ఒడిశాలో కేవలం రూ. 240లకే ఇస్తుండడంతో వినియోగదారులు ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా స్థానిక వ్యాపారులమైన మాపై తీవ్ర ప్రభావం పడుతోంది.                 – రాంబాబు,
సిమెంట్‌ వ్యాపారి, పార్వతీపురం

మరిన్ని వార్తలు