శ్మశానంపై పెత్తనం

27 Jun, 2016 03:05 IST|Sakshi
శ్మశానంపై పెత్తనం

ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం
శవం పూడ్చాలంటే అనుమతి  పొందాలంటూ హుకుం
బాపురంలో బరితెగించిన తెలుగు తమ్ముడు

 
ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ ఎంపికచేసుకున్న హాలహర్వి పంచాయతీ అది. దాని మజరా గ్రామమే హెచ్ బాపురం. ఆ గ్రామంలో ఎవరు మృతి చెందినా టీడీపీ నాయకుడి కుటుంబం అనుమతితోనే శ్మశానంలో పూడ్చుకోవాలి. వారు కాదంటే ఎవరి ఇంటిముందు వారు పూడ్చుకోవాల్సిందే. ఏకంగా శ్మశానాన్నే కబ్జాచేసేశాడు ఆ ఘనుడు..! - ఎమ్మిగనూరు
 
నందవరం మండలంలోని హాలహర్వి గ్రామ పంచాయతీ మజరా గ్రామం హెచ్.బాపురం. తరతరాలుగా ఆ గ్రామప్రజలకు శ్మశానవాటికగా గ్రామకంఠం బావిగడ్డ ఉపయోగపడుతోంది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రామ టీడీపీ నాయకుడు కిష్టప్ప కుటుంబం.. శవరాజకీయాలకు తెరలేపింది. బావిగడ్డ ప్రాంతం తమ పూర్వీకులదనీ, అక్కడ ఎవరైనా శవాన్ని పూడ్చాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ హుకూం జారీ చేశారు. శ్మశానంలో ఉన్న కంపచెట్లను తాము తప్ప ఎవరూ కొట్టుకోరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు కూడా.

మూడు రోజుల క్రితం శుక్రవారం అదే గ్రామానికి చెందిన తెలుగు జయమ్మ(57)మృతి చెందింది. బంధువుల సమక్షంలో ఆమెను ఖననం చేయడానికీ కుటుంబసభ్యులు శ్మశానవాటికకు వెళ్లారు. తీరా అక్కడ తవ్విన గుంతవద్ద టీడీపీ నాయకుడు కిష్టన్న కుటుంబసభ్యులు ఖననాన్ని అడ్డుకొన్నారు. తమకు తెలపకుండా శవం ఎట్లా పూడ్చుతారంటూ వాదనకు దిగారు. గుంతను తవ్వే వారిపై దాడికి దిగడంతో శోక తప్త హృదయాలతో  అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు. శ్మశానం దగ్గర గొడవలెందుకనీ చివరకు జయమ్మను తమ ఇంటిముందే పూడ్చుకొని అంత్యక్రియలు జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచీ ఖననానికి వచ్చిన వారంతా ఇదెక్కడి ఆచారం.. ఇదేమీ అధికారం.. కాటికాపరులకంటే కఠినంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ శాపనార్థాలు పెట్టడడం గమనార్హం.
 
 
 ఇది దుర్మార్గం
శత్రువైనా చనిపోయిన తరువాత అయ్యో పాపం అంటూ సానుభూతి చూపుతాం. కానీ చచ్చిన శవాలమీద రాజకీయాలు చేసి పైశాచిక ఆనందం పొందటం టీడీపీ నాయకులకే చెల్లింది. అధికారంలో ఉన్నామనీ కిష్టప్ప కుటుంబం విర్రవీగుతోంది. మా ముత్తాతల కాలం నుంచీ ఎవరు చచ్చినా బావిగడ్డ దగ్గరే పూడ్చుతాం. తవ్విన గుంతలో శవాన్ని పూడ్చకుండా అడ్డుకోవటం బాధాకరం. శవం పూడ్చాలంటే వీళ్ల అనుమతీ తీసుకోవాలా..ఇదేమీ ఊరు?    -  వెంకటమ్మ, మృతురాలి ఆడపడుచు
 
 మా అనుమతి తీసుకోవాల్సిందే
బావిగడ్డ శ్మశానంలో శవాలను పూడ్చాలంటే  మా అనుమతి తీసుకోవాల్సిందే. జయమ్మ కుటుంబం అడక్కుండానే గుంత తవ్వడంతో మా వాళ్లు అడ్డుకొన్నారు. ఎవరు చచ్చినా పూడ్చాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. -  కిష్టప్ప, టీడీపీ నాయకుడు
 
శ్మశానానికి స్థలం కేటాయించాలి
చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 ఎకరాలు శ్మశానం కోసం  ఇచ్చారు. గ్రామానికి దూరంగా ఉండటంతో గ్రామస్తులంతా బావిగడ్డ వద్దే శవాలను పూడుస్తున్నారు. బావిగడ్డ శ్మశానానికి దగ్గరలో ప్రభుత్వం స్థలం కేటాయించాలి. - ఎంకన్న,గ్రామస్తుడు
 

మరిన్ని వార్తలు