శ్మశానాన్ని ఆక్రమించిన టీడీపీ నేత

28 Aug, 2014 01:26 IST|Sakshi
శ్మశానాన్ని ఆక్రమించిన టీడీపీ నేత

సాక్షి ప్రతినిధి, విజయనగరం : చివరకు శవాలను పూడ్చే భూములనూ వదలడం లేదు. ఊరికి దూరంగా ఉన్న శ్మశానాన్ని సైతం కబ్జా చేశా రు. ఆక్రమణకు కాదేది అనర్హమని నిరూపించారు. టీడీపీ నేతొకరు ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. భూమి విలువ పెరగడంతో ఆక్రమణకు తెగబడ్డారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, ఆ స్థలంలో దర్జాగా సాగు చేస్తున్నారు. వీటిని సాగు భూములుగా చూపించి ఏదోక రోజున రికార్డులను సృష్టించినా ఆశ్చర్యపోక్కర్లేదు. జాతీయ రహదారికి ఆనుకుని, విశాఖనగరానికి దగ్గర్లో ఉండడం, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయన్న ప్రచారం, ఎయిర్ పోర్ట్ రానుందన్న వార్తలతో భోగాపురం మండలంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. శివారు గ్రామాల్లో సైతం భూములకు గిరాకీ పెరిగింది.
 
 దీంతో అధికారం అండ ఉన్న కొంతమంది.. భూములను దర్జాగా ఆక్రమించి తమ వశం చేసుకుంటున్నారు. మండలంలోని భెరైడ్డిపాలెంలో అదే జరిగింది. అక్క డొక టీడీపీ నేత ఏకంగా శ్మశానాన్ని కబ్జా చేసేశారు.  రెడ్డికంచేరు రోడ్డులో, మిరాకిల్ కంపెనీకి వెళ్లే దారిలో ఎకరా భూమి సుమారు రూ.70 లక్షలు పలుకుతోంది. ఆ గ్రామ శివారులో శ్మశానం కింద సర్వే నంబర్.30/1లో 8.16 ఎకరాలున్నాయి. వీటి మధ్యనే  చిన్న చెరువు, సాగునీటి కాలువ ఉంది.  ఓ టీడీపీ నేత కన్ను ఈ భూమిపై పడింది. అక్కడికి ఎవరొస్తారులే అని ఆక్రమణకు దిగారు.  శ్మశానం కోసం 15సెంట్లు భూమి వదిలేసి మిగతాదంతా చదును చేసేశారు. కొంతమేర వేరుశనగ, మరికొంతమేర కొబ్బరి మొక్కలు వేశారు.
 
 కళ్లముందే శ్మశానం భూమి ఆక్రమణకు గురైనా ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోతున్నారు.  గతంలో ఒకసారి ఆక్రమించారన్న ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు వెళ్లి రాళ్లు పాతారు. అయితే, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ రాళ్లు పీకేసి యథేచ్ఛగా చదును చేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడా ఆక్రమణదారు  చేతిలో ఉన్న భూముల విలువ రూ.4 కోట్ల మేర ఉండొచ్చని అంచనా.  గతంలో ఫిర్యాదు చేసేందుకైనా స్థానికులు ముందుకొచ్చారు. ఇప్పుడు చేతిలో ఉన్న అధికారంతో  ఏం చేస్తారన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ   ఫిర్యాదు చేయడం లేదు. ఎవరో వచ్చి వెలికి తీస్తే తప్ప శ్మశాన భూములను కాపాడుకోలేమని స్థానికులు వాపోతున్నారు.
 
 శ్మశాన భూములను కాపాడుతాం: తహశీల్దార్
 భెరైడ్డిపాలెంలోని శ్మశాన భూములు అక్రమణ గురయ్యాయన్న విషయం తన దృష్టికి రాలేదని భోగాపురం తహశీల్దార్ పేడాడ జనార్దనరావు తెలిపారు. ఫిర్యాదొచ్చినా, రాకపోయినా నిజంగా ఆక్రమణ జరిగితే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణదారుడు కబంధ హస్తాల నుంచి భూములను కాపాడతామన్నారు.
 

మరిన్ని వార్తలు