అపార్ట్‌మెంట్‌కు అడ్డొచ్చిందని...

9 Nov, 2017 10:57 IST|Sakshi

 శ్మశానం మార్పు

రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన బిల్డర్‌

సహకరిస్తున్న స్థానిక పెద్దలు    

బొబ్బిలి: ఓ బిల్డర్‌ వ్యాపారానికి అడ్డొచ్చిందని దశాబ్దాల తరబడి వినియోగిస్తున్న శ్మశానాన్ని మార్చేశారు. ఇప్పటికే ఓ కాలనీ వాసులకు శ్మశానానికి స్థలమిచ్చిన గ్రామానికి తరలించడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజనులు తమ శ్మశానం వాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మున్సిపాలిటీలోని గెస్ట్‌హౌస్‌ కాలనీ సమీపంలో  అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు ఉమ్మడిగా ఉన్న శ్మశానం సుమారు ఎకరా విస్తీర్ణంలో వాడుకలో ఉండేది. ఇటీవల ఆ పక్కనే జిరాయితీ భూమిని కొన్న ఓ బిల్డర్‌ పక్కన శ్మశానం ఉందన్న విషయం తెలియక కొనేసి బిల్డింగ్‌ నిర్మించారు. అయితే ఆ శ్మశానాన్ని మరో చోటకు తరలించేందుకు కాలనీకి చెందిన కొందరు పెద్దలు బిల్డర్‌కు సహకరించడంతో రెండు గ్రామాల మధ్య శ్మశాన వివాదం తలెత్తింది.

 గెస్ట్‌హౌస్‌ కాలనీ శ్మశానానికి ఉన్న రహదారిని తవ్వేసి పక్కనే ఉన్న పోలవానివలస శ్మశానంలో దహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా పోలవానివలస గ్రామ గిరిజనులను హెచ్చరించడం, బెదిరించడంతో వారు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం ఓ బిల్డర్‌ వ్యాపారం కోసం ఇక్కడి శ్మశానాన్ని తరలించడం ఏమిటని స్థానికులు వాదిస్తున్నా అధికారులు ఆదేశించారని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా శ్మశానానికి రోడ్డు వేసేందుకు అక్కడి సమాధి చేసిన మృతదేహాలను కూడా వెలికి తీశారని గిరిజన గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే ఎవరి శ్మశానాన్ని వారికి కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

బావి తవ్వుకుంటే పాడు చేశారు
శ్మశానానికి అవసరమైన బావిని తవ్వించాం. బిల్డర్‌ ఇక్కడ శ్మశానం ఏమిటని బావికి ఉన్న కప్పులను తవ్వించేశారు. అసలు మా శ్మశానం వద్ద బిల్డింగ్‌ కట్టడమేమిటి? శ్మశానాన్ని తరలించడం ఏమిటి? మేం ఒప్పుకోం. ఎక్కడి శ్మశానం అక్కడే ఉండాలి. 
–అరసాడ మురళి, స్థానికుడు, గెస్ట్‌హౌస్‌ కాలనీ 

 రోడ్డు తవ్వేసి మరో రోడ్డు వేశారు 
మా కాలనీ వాసులు వినియోగిస్తున్న శానానికి ఉన్న రహదారిని తవ్వేశారు. మరో శ్మశానానికి వెళ్లాలని మరో రోడ్డు వేశారు. మా కాలనీకి చెందిన కొందరు ప్రబుద్ధులకు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇదెక్కడి న్యాయం?
కె.పార్వతి, మున్సిపల్‌ కౌన్సిలర్, 21వ వార్డు 

1960 నుంచి ఉంటున్నాం..
మేం ఐటీఐ నిర్మించినపుడు అక్కడుండటం శ్రేయస్కరం కాదని అప్పటి చైర్మన్‌ ఆరి గంగయ్య మాకు ఇక్కడ స్థలమిచ్చారు. గెస్ట్‌హౌస్‌ కాలనీకి శ్మశానం లేదంటే మేమే స్థలమిచ్చాం. ఎవరో ఖాళీ చేయమంటే మా శ్మశానానికి వస్తామంటున్నారు. ఇదెలా కుదురుతుంది? మేం ఇచ్చేది లేదు. వాళ్ల గొడవలు వారే తీర్చుకోవాలి. మధ్యలో మా మీదకు వస్తారా?
–ముంగి సింహాద్రి, గిరిజన పెద్ద, పోలవానివలస

మరిన్ని వార్తలు