ప్రజల చెంతకే పోలీసు వ్యవస్థ

23 Oct, 2014 05:08 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్): పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ వెల్లడించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసుల సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందేలా చర్యలు చేపట్టామన్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలను పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.

తమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా, గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, వ్యభిచారం, రౌడీయిజం, అరాచకశక్తుల ఆగడాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసం 94946 26644 నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు.  ఏదేని సమాచారాన్ని ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే తమ సిబ్బంది కాల్ చేసి సమాచారం తీసుకుంటారన్నారు.

ఫేస్‌బుక్‌లోని ‘నెల్లూరు పోలీసు’కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నేరరహిత సమాజ ఏర్పాటులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం దీనిపై విసృ్తత ప్రచారం కల్పించాలన్నారు. ఇప్పటికే డయల్ 100, 1090, నెల్లూరు పోలీసు ఫేస్‌బుక్ అకౌంట్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.

వాటిని పరిశీలించి కేసులు సైతం నమోదు చేస్తున్నామన్నారు.  94946 26644నంబర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫోన్ నంబర్ సేవలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు బి.వి రామారావు, వీఎస్ రాంబాబు, శ్రీనివాసరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు