ఇక సేఫ్‌ జర్నీ!

11 Jul, 2020 11:35 IST|Sakshi
డోన్‌ పట్టణ శివారులోని ఎన్‌హెచ్‌ 44 పై కంబాలపాడు సర్కిల్‌

డోన్‌  పట్టణ శివారులోని చౌరస్తాలలో వంతెనలు, సర్వీసు రోడ్ల నిర్మాణం

ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం

రూ.107.37కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతులు  

డోన్‌: హైదరాబాద్‌– బెంగళూరు జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోగా మరెందరో క్షతగాత్రులయ్యారు. ఈ మార్గంలో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి ఉంది.  డోన్‌ శివారులోని ప్రధాన కూడళ్లు మరింత డేంజర్‌గా మారాయి. రహదారిపై  వేలాది వాహనాలతో పాటు చుటుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలతో ఆ సర్కిళ్ల వద్ద రద్దీ ఉంటుంది. ఇక్కడ ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితి.  ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అండర్‌ పాస్‌ బ్రిడ్జీలు, ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి సంబంధించినప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

రూ.107.37 కోట్ల ప్రాజెక్టుకు అనుమతి మంజూరు  
 ప్రమాదాల నివారణకు పట్టణ శివారులోని కంబాలపాడు, కొత్తపల్లె సర్కిళ్లలో అండర్‌ పాస్‌ బ్రిడ్జీలు, కొత్తపల్లెనుంచి ఉడుములపాడు వరకు గల జాతీయ రహదారికి ఇరువైపులా 6 కి.మీ పొడవునా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని  రాష్ట్ర ఆర్థిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వందృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విన్నవించారు కూడా.  దీంతో  కేంద్రం   ఆయా పనులకు రూ.107.37 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చింది.  పనులను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కు  అప్పగించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పనులు జరిగితే ప్రమాదాల నివారణతో పాటు పట్టణం మరింత విస్తరించడానికి అవకాశముంటుందని డోన్‌ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు