సీమాంధ్ర ఆందోళనలపై కేంద్రం ఆరా

6 Aug, 2013 02:52 IST|Sakshi
సీమాంధ్ర ఆందోళనలపై కేంద్రం ఆరా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర నిఘావర్గాలు నేరుగా రంగంలోకి దిగాయి. సమైక్యాంధ్ర కోరుతూ జరుగుతున్న ఆందోళనలు రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నాయా, స్వచ్ఛందంగా ప్రజలే పాల్గొంటున్నారా, ఆందోళనలను ప్రేరేపించేలా తెర వెనక ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నాయి. విద్యార్థులు, యువతతో పాటు ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఆందోళనల్లో భాగస్వాములవుతున్నట్టు నిఘా పరిశీలనలో స్పష్టమైంది. ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆందోళనలు మరింత ఉధృత రూపు దాల్చుతున్నాయని, అక్కడ పరిస్థితి చేయి దాటేలా కన్పిస్తోందని నిఘా అధికారులు ప్రాథమిక ంగా అంచనా వేశారు. కడప, చిత్తూరుతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఆందోళనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వారు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఆందోళనలు పెరుగుతున్నా శాంతిభద్రతలు మాత్రం ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నట్టు సమాచారం.
 
 తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన తర్వాత సీమాంధ్రలో తొలి మూడు రోజుల ఆందోళనపై రాష్ర్ట నిఘా వర్గాలు తొలుత కేంద్ర హోం శాఖకు ప్రాథమిక నివేదిక అందించాయి. ఆందోళనలు కొనసాగుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అనంతపురంలో మాత్రం కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. పరిస్థితి వారంలోపే కుదుట పడవచ్చని పేర్కొన్నాయి.అయితే రోజురోజుకూ సీమాంధ్రలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం, నిరసనలు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల వరకూ విస్తరించడంతో కేంద్ర నిఘా అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. అత్యధిక ప్రాంతాల్లో ఆందోళనలు పార్టీలు, నేతల ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వస్తున్నారని వారి అధ్యయనంలో తేలింది. గ్రామ స్థాయిల్లో కూడా నిరసన ర్యాలీలు కొనసాగడం మరింత ఆందోళనకరమై అంశమని భావిస్తున్నారు. ఆందోళనలు ఎన్ని రోజుల పాటు కొనసాగవచ్చేనే అంశాలపై వివిధ వర్గాల ప్రతినిధుల ద్వారా నిఘా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
 
 రాజధానిలో పరిస్థితులపై అధ్యయనం
 హైదరాబాద్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిఘా అధికారులు ప్రత్యేక పరిశీలనకు దిగాయి. సీమాంధ్రకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, వ్యాపారులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల భయాందోళనలపై కూడా పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడిన మర్నాటి నుంచే సచివాలయంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండటం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన వారిలో మరింత అలజడి రేపడం తెలిసిందే.
 
 ఉద్యోగుల నిరవధిక సమ్మె మొదలైతే
 విభజనకు వ్యతిరేకంగా ఆగస్టు 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవో నేతలు ప్రకటించడం ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చనే అంశంపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉద్యోగుల సమ్మె వల్ల శాంతిభద్రతల పరంగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ సీమాంధ్రలో ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని భావిస్తున్నాయి. ‘‘ఉద్యోగులు సచివాలయంతో పాటు ఆయా కార్యాలయాల్లోనూ నిరసనలు, ఆందోళనలకు దిగవచ్చు. దాంతో హైదరాబాద్‌లో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనవచ్చు’’ అని అనుమానిస్తున్నాయి.
 
 శాంతిభద్రతలపై డీజీపీ సమీక్ష
 సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సమీక్షించారు. అన్ని రీజియన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలతో ఫోన్‌లో మాట్లాడారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆందోళనలు కొనసాగుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఎస్పీల నుంచి నివేదికలందాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు